తెలంగాణ నూతన గవర్నర్ గా త్రిపుర రాష్ట్రానికి చెందిన జిష్ణుదేవ్ వర్మను రాష్ట్రపతి నియమించారు. రేపు ఆయన గవర్నర్ గా పదవీ బాద్యతలు స్వీకరించనున్నారు. అయితే జిష్ణుదేవ్ నియామకం వెనక తెలంగాణ సీఎం రేవంత్ హస్తం ఉందా అన్న అనుమానాలు రాజకీయ, మీడియా వర్గాలలో ప్రస్తుతం తీవ్ర చర్చానీయాంశంగా మారాయి.
గవర్నర్ గా ఎంపికయిన తర్వాత తాజాగా ఓ ఇంటర్వ్యూలో జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ, తెలంగాణ సీఎం రేవంత్ లు కాల్ చేసి చెప్పే వరకు తాను గవర్నర్ గా ఎంపికయిన విషయం తెలియదు అని చెప్పడమే ప్రస్తుతం ఈ చర్చకు కారణం. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీఎం. గవర్నర్ లను ప్రధానమంత్రి సిఫారసు చేస్తారు. రాష్ట్రపతి నియామక ఉత్తర్వులు జారీ చేస్తారు.
మరి ఈ విషయం తెలిస్తే .. గిలిస్తే ప్రధానమంత్రి తర్వాత తెలంగాణ బీజేపీ నేతలకు తెలియాలి. లేదంటే ప్రస్తుతం త్రిపుర గవర్నర్ గా పనిచేస్తున్న తెలంగాణకు చెందిన నల్లు ఇంద్రసేనారెడ్డికి తెలియాలి. కానీ అందరికంటే ముందు రేవంత్ కు ఎలా తెలిసింది ? అని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఢిల్లీ స్థాయిలో రేవంత్ గట్టి సంబంధాలు ఏర్పరచుకున్నాడా ? లేక బీజేపీ పెద్దలు ఆయనకు ముందే తెలిపారా ? అని భావిస్తున్నారు.
త్రిపుర రాజకుటుంబానికి చెందిన జిష్ణుదేవ్ వర్మ రామజన్మభూమి ఉద్యమ సమయంలో 1990లో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరాడు. 2018లో త్రిపురలోని చరిలం శాసనసభ స్థానం నుండి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై బీజేపీ ప్రభుత్వంలో ఐదేళ్లు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఇటీవల ఎన్నికల్లో అదే శాసనసభ స్థానం నుండి త్రిపుర మొహత పార్టీ అభ్యర్థి సుబోద్ దేబ్ బర్మ చేతిలో ఓటమి చవిచూశాడు. అయితే త్రిపురకు చెందిన వారికి గవర్నర్ స్థాయి పదవి ఇవ్వడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates