యేలేటి వారు… ఎన్నాళ్లకెన్నాళ్లకు

ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు టాలీవుడ్ ఒక మూసలో సినిమాలు చేస్తున్న టైంలో ఐతే లాంటి అద్భుతమైన సినిమాతో సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిన దర్శకుడు.. చంద్రశేఖర్ యేలేటి. ఆ తర్వాత ఆయన తీసిన ‘అనుకోకుండా ఒక రోజు’ ఇంకా స్పెషల్. అది కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది.

ఆ తర్వాత కూడా ఒక్కడున్నాడు, సాహసం, ప్రయాణం, మనమంతా లాంటి వెరైటీ చిత్రాలతో తన ప్రత్యేకతను చాటుకున్నారాయన. కానీ చివరి చిత్రం ‘చెక్’ తీవ్ర నిరాశకు గురి చేయడంతో యేలేటి సైలెంట్ అయిపోయారు.

కొన్నేళ్లుగా ఆయన సినిమా ప్రయత్నాలే చేస్తున్నట్లు కనిపించడం లేదు. మధ్యలో ప్రొడక్షన్ చేద్దామని చూసినా కుదరలేదు. ఇక మళ్లీ యేలేటి సినిమా తీయడేమో అని చాలామంది అనుకున్నారు. కానీ ఈ విలక్షణ దర్శకుడు మళ్లీ ఓ సినిమా చేయడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తుండడం తన అభిమానులకు ఉత్సాహాన్నిస్తోంది.

యేలేటితో సినిమాను నిర్మించడానికి ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ రెడీ అయినట్లు తెలుస్తోంది. తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న తమిళ లేటెస్ట్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్‌ హీరోగా సినిమా చేయడానికి యేలేటి ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. కానీ అతడికున్న డిమాండ్, కమిట్మెంట్ల దృష్ట్యా ఇప్పుడు యేలేటి సినిమాకు ఓకే అంటాడా అన్నది సందేహమే.

ఐతే ప్రదీప్ కాకపోతే ఇంకో హీరోతో సినిమా చేయొచ్చు. కానీ యేలేటి మళ్లీ మెగా ఫోన్ పట్టాలనుకోవడమే తన అభిమానులకు అమితానందాన్ని ఇస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్లలో యేలేటి ఒక ఓజీ అన్నది అందరూ అంగీకరించాల్సిన విషయం.

చివరి చిత్రాలు సరైన ఫలితాన్ని అందుకోకపోయినా.. ఇప్పటికీ ఆయన శ్రద్ధ పెడితే కల్ట్ మూవీస్ తీయగలడని చెప్పొచ్చు. మరి యేలేటి సినిమాలో నటించే హీరో ఎవరవుతారో.. ఆయన ఈసారి ఎలాంటి కాన్సెప్ట్‌తో వస్తాడు అన్నది ఆసక్తికరం. త్వరలోనే ఈ తీపికబురును అభిమానులు వినొచ్చు.