తారకరత్న కుటుంబాన్ని పట్టించుకోవట్లేదా?

కొన్నేళ్ల ముందు నందమూరి తారకరత్న ఒక రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గుండెపోటుకు గురి కావడం, కొన్ని రోజుల పాటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి చనిపోవడం అందరినీ కలచివేసింది. నటుడిగా ఎంతో ప్రయత్నించి ఫెయిలైన అతను.. రాజకీయాల్లో అయినా వెలిగిపోవాలని అనుకున్నాడు. కానీ కుదరలేదు.

అప్పటికే పెళ్లయి విడాకులు తీసుకున్న అలేఖ్య రెడ్డిని పెళ్లి చేసుకోవడం వల్ల కుటుంబం కూడా అతణ్ని దూరం పెట్టింది. ఇలా అనేక ఇబ్బందులు పడ్డ అతను.. హఠాత్తుగా చనిపోవడం అందరినీ బాధించింది. ఐతే తారకరత్న మరణానంతరం అలేఖ్య రెడ్డి, ఆమె పిల్లల పరిస్థితి ఏంటో ఎవరికీ తెలియదు. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో తారకరత్నను తలుచుకుని బాధ పడ్డారు. తన పిల్లలకు నందమూరి కుటుంబం నుంచి ఆశించిన ఆదరణ లేదని వాపోయారు.

నందమూరి కుటుంబానికి ఇష్టం లేకుండా తామిద్దరం పెళ్లి చేసుకోవడంతో తమను ఆ ఫ్యామిలీలో కలుపుకోలేదని ఆమె తెలిపారు. తారకరత్న మరణానంతరం ఒక్క బాలకృష్ణ మాత్రమే తమ బాగోగుల గురించి పట్టించుకున్నారని.. మద్దతుగా నిలుస్తూ వస్తున్నారని అలేఖ్య చెప్పారు.

తారకరత్నతో పెళ్లికి తమ కుటుంబం నుంచి ఎప్పుడూ అభ్యంతరం లేదని.. వాళ్ల నుంచి ఎప్పుడూ మద్దతు ఉందని చెప్పారు. కానీ నందమూరి కుటుంబం భవిష్యత్తులో అయినా.. తారకరత్న పిల్లలను దగ్గరికి తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ఆమె చెప్పారు.

అలేఖ్య.. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి అత్యంత దగ్గర బంధువు. ఆమె కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో తాను కూడా భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావచ్చని ఆమె ఈ ఇంటర్వ్యూలో సంకేతాలు ఇచ్చారు. మరి ఎంత కాదనుకున్నా ఆమె నందమూరి కుటుంబ సభ్యురాలే కాబట్టి.. తనకు తెలుగుదేశం పార్టీ అవకాశమిస్తుందా.. లేక అలేఖ్య చూపు వేరే పార్టీల వైపు వెళ్తుందా అన్నది చూడాలి.