ప్రజల కోసమే తన జీవితమని.. ప్రజా సమస్యలపై పోరాడేందుకు సినిమాలను వదిలేసి రాజకీయాల్లోకి వచ్చానని ప్రకటించి రెండేళ్ల పాటు జనసేనను ప్రజల్లో పరుగులు పెట్టించిన జనసేనాని పవన్ కళ్యాణ్‌కు ఇప్పుడు రాజకీయాలు చేసే టైం లేదా? పూర్తిగా సినిమాలతోనే బిజీ అయిపోయారా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. ఇప్పుడు వరుస సినిమాలతో తీరిక లేకుండా ఉన్న ఆయన.. ఇక పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టి రాజకీయాల్లో ఎదిగేది ఎప్పుడనే మాటలు వినిపిస్తున్నాయి.
రాజకీయాల కోసం సినిమాలు వదిలేశానని గతంలో చెప్పిన పవన్ ఆ తర్వాత తనకేమైనా ఆస్తులు ఉన్నయా? సినిమాలు చేస్తేనే డబ్బులు వస్తాయని మాట మార్చి మళ్లీ ముఖానికి రంగు వేసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని ప్రకటించిన ఆయన ఇప్పుడు ప్రజా సమస్యలను గాలికొదిలేశారనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఆయన చేతిలో దాదాపు అయిదు సినిమాలున్నాయి. వాటిని పూర్తి చేసేసరికి 2023 గడిచిపోతుంది. 2024లో మళ్లీ ఎన్నికలు వస్తాయి. ఈ నేపథ్యంలో ఆ ఎన్నికలకు ఆయన పార్టీని ఎలా సిద్ధం చేస్తారు? తాను ఎలా సిద్ధమవుతారు? అనేవి జవాబు లేని ప్రశ్నల్లాగే మిగిలిపోనున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
2018లో అఙాతవాసి తర్వాత దాదాపు రెండేళ్ల విరామం తీసుకున్న పవన్ గతేడాది వకీల్‌సాబ్ షూటింగ్ కోసం మళ్లీ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఈ ఏడాది విడుదలైన ఆ సినిమా మంచి విజయం అందుకోవడంతో జోరు మీదున్న ఆయన వరుస సినిమాలు చేయడం మొదలెట్టారు. ప్రస్తుతం మళయాల రీమేక్ అయ్యప్పనుమ్ కోశియమ్ చేస్తున్న ఆయన దీని తర్వాత క్రిష్ డైరెక్షన్లో హరిహర వీరమల్లును పూర్తి చేయనున్నట్లు తెలిసింది. ఆ తర్వాత హరీశ్ శంకర్‌తో పాటు మరో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా మరిన్ని సినిమాలకు అడ్వాన్స్‌లు కూడా తీసుకోవాలనే ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విధంగా చూసుకుంటే 2023 వరకూ పవన్ ఫుల్ బిజీగా ఉండనున్నట్లే లెక్క.
ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదంపై వేచి చూసే ధోరణి అవలంబించిన పవన్ ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగుల సమస్యలపై పూర్తి స్థాయిలో పోరాటం చేసేలా కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో ఆయన జనసేనను ఏ విధంగా ముందుకు నడిపిస్తారో చూడాలి.