ఈ `తెలివి` తేట‌లు సీఎం రేవంత్ వేనా?

తెలివి ఎవ‌రి సొత్తూ కాదు. ఐడియా ఉండాలేకానీ.. ఎంత క‌ష్ట‌మైన పనైనా సులువుగా మారిపోవ‌డంతోపాటు సులువుగా మార్చుకోవ‌డానికి కూడా అవ‌కాశం ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి ఓ అద్భుత‌మైన ఐడియానే తెలంగాణ ప్ర‌భుత్వం చేసింది. డ‌బ్బుల‌తో ప‌నిలేకుండా.. పొరుగు రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేయ‌డ‌మే ఈ ఐడియా సారాంశం. ఇది కొంత వింత‌గా ఉన్న‌ప్ప‌టికీ.. కాంగ్రెస్ పాలిత తెలంగాణ‌లో త్వ‌ర‌లోనే ఇది అమ‌ల్లోకి రానుంది. దీనికి సంబంధించిన ఒప్పందాలు కూడా పూర్త‌య్యాయట‌.

కాంగ్రెస్ స‌ర్కారుకు బీజేపీ నుంచి..

తెలంగాణ‌లోని కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి.. బీజేపీకి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేసినా భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి ఉన్న విష‌యం తెలిసిందే. అయితే.. తాజాగా విద్యుత్ ఇచ్చి-వ‌డ్డీతో పుచ్చుకునే ఒప్పందానికి బీజేపీ పాలిత ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ముందుకు రావ‌డం గ‌మ‌నార్హం. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌స్తుతం మిగులుగా ఉన్న విద్యుత్‌ను అప్పుగా తెలంగాణ‌కు ఇస్తారు. ఆ త‌ర్వాత‌.. తెలంగాణ మిగులులోకి వెళ్ల‌గానే.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు కొంత వ‌డ్డీ రూపంలో అద‌నంగా విద్యుత్‌ను క‌లిపి తిరిగి ఇచ్చేస్తారు. ఇదీ.. ఒప్పందం. దేశ చ‌రిత్రలో ఇలా.. ఒక ప్ర‌భుత్వం నుంచి మ‌రో ప్ర‌భుత్వం అప్పుగా వ‌న‌రులు తీసుకోవ‌డం.. దానిని వ‌న‌రుల రూపంలో తిరిగి చెల్లించ‌డం ఇదే తొలిసారి అని అంటున్నారు ప‌రిశీల‌కులు.

రోజుకు ఎంత‌?

ప్ర‌స్తుత అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఉత్ప‌త్తిచేసిన విద్యుత్‌లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు రోజుకు 3 వేల మెగావాట్ల‌కు పైగానే విద్యుత్ మిగిలిపోతోంది. అక్క‌డ ఇప్పుడు పంట‌లు లేవు. దీంతో యూపీలో విద్యుత్ వినియోగం త‌గ్గింది. కానీ, ఉత్ప‌త్తి మాత్రం త‌గ్గలేదు.

ఈ విష‌యం తెలుసుకున్న తెలంగాణ స‌ర్కారు.. అక్క‌డి అధికారులు, ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు జ‌రిపారు. డ‌బ్బులు కాదు.. విద్యుత్ టు విద్యుత్ వ‌డ్డీతో స‌హా ఇచ్చిపుచ్చుకునేలా ఒప్పందానికి వ‌ద్దామ‌ని నిర్ణ‌యించుకున్నారు. అనంత‌రం ఈ ఒప్పందం కుదిరింది. దీని ప్ర‌కారం .. రోజుకు 3 వేల మెగావాట్ల విద్యుత్‌ను తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకుంది. దీనిని మిగులు స‌మ‌యంలో 5 శాతం అద‌నంగా.. విద్యుత్‌ను వ‌డ్డీ రూపంలో క‌లిపి.. తిరిగి ఇచ్చేయనుంది.

మంచి ఐడియా!

తెలంగాణ ప్ర‌భుత్వం.. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈఐడియాపై విద్యుత్ రంగ నిపుణులు హర్షం వ్య‌క్తం చేస్తున్నారు. డ‌బ్బుల‌తో ప‌నిలేకుండా.. విద్యుత్ టు విద్యుత్ అప్పుగా తీసుకుని.. తిరిగి చెల్లించే విధానాన్ని వారు ప్ర‌శంసిస్తున్నారు.

త‌ద్వారా.. రాష్ట్రంపై ఆర్థిక భారం త‌ప్పుతుంద‌ని.. అదేస‌మ‌యంలో రాష్ట్ర అవ‌స‌రాల‌కు కీల‌క‌మైన విద్యుత్ స‌మ‌యానికి అందుతుంద‌ని పేర్కొంటున్నారు. ఇక‌, రాష్ట్రంలో ఇప్పుడు విద్యుత్ అవ‌స‌రం. మ‌రో మూడు మాసాల్లో వ‌ర్షాలు ప్రారంభం అయితే.. అప్పుడు ఇక్క‌డ విద్యుత్ ఉత్ప‌త్తి పెరుగుతుంది. త‌ద్వారా తీసుకున్న విద్యుత్‌ను తిరిగి ఇచ్చేయొచ్చ‌ని చెబుతున్నారు.