ఏపీలో హోటల్స్… ఇబ్బంది లేనట్టేనా?

వంటగ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హోటళ్లకు సరఫరా అయ్యే కమర్షియల్ సిలిండర్ల పంపిణీని తాత్కాలికంగా నిలిపివేయాలని పెట్రోలియం కంపెనీలు డీలర్లకు ఆదేశించడంతో హోటల్ యజమానుల్లో ఆందోళన నెలకొంది.

గ్యాస్ లేకపోవడంతో వ్యాపారం కొనసాగించడం కష్టమవుతోందని వారు చెబుతున్నారు. ఇప్పటికే ప్రధాన నగరాలైన ముంబయి, దిల్లీ, బెంగళూరులో పలు చిన్న హోటళ్లు తాత్కాలికంగా మూతపడ్డాయి. సరఫరా సక్రమంగా లేకపోవడం వల్ల వంట చేయడం సాధ్యం కాక హోటల్ యజమానులు వ్యాపారాన్ని నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని సమాచారం.

దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో వంటగ్యాస్ కొరతతో చిన్న హోటళ్లు మూతపడుతున్నాయనే వార్తల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో గృహ అవసరాలకు, వాణిజ్య అవసరాలకు సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయని తెలిపారు. ప్రజలు ఎటువంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు.

రాష్ట్రంలో గ్యాస్ సరఫరా పరిస్థితిపై మంత్రి ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రానికి హెచ్‌పీసీఎల్ విశాఖపట్నం రిఫైనరీ, మంగళూరు నుంచి వచ్చే హస్సన్–చర్లపల్లి పైప్‌లైన్‌తో పాటు హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీ సంస్థల డిపోల ద్వారా సరఫరా జరుగుతోందని వివరించారు. రోజువారీ అవసరాలకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఎక్కడైనా లోటు ఏర్పడితే వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపడతామని తెలిపారు.

గ్యాస్ అక్రమంగా బ్లాక్ మార్కెట్‌కు మళ్లకుండా జిల్లాల వారీగా ప్రత్యేక నిఘా బృందాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పుకార్లు వ్యాప్తి చేసి ధరలు పెంచే ప్రయత్నాలు చేసినా, తప్పుడు సమాచారం ప్రచారం చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మి ప్రజలు భయపడవద్దని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు.