బ్లాక్ బస్టర్ మిత్రులకు బ్రేక్

బన్నీ వాసు, వంశీ నందిపాటి.. ఈ మధ్య టాలీవుడ్‌లో లక్కీ ప్రొడ్యూసర్స్‌గా పేరు తెచ్చుకున్న జంట. ఇద్దరూ ఇంతకుముందు వేర్వేరుగా సినిమాలు తీసేవాళ్లు. బన్నీ వాసు చాలా ఏళ్ల పాటు గీతా ఆర్ట్స్ సంస్థలో అంతర్భాగంగా ఉన్నాడు. తర్వాత బన్నీ వాస్ వర్క్స్ పేరుతో సొంత బేనర్ పెట్టుకున్నాడు. వంశీ నందిపాటి డిస్ట్రిబ్యూషన్లో పేరు తెచ్చుకుని ఆ తర్వాత నిర్మాతగా మారాడు.

ఈ ఇద్దరూ కలిసి ఆల్రెడీ పూర్తయిన కంటెంట్ సినిమాలను తమ చేతుల్లోకి తీసుకుని రిలీజ్ చేయడం ద్వారా వరుస విజయాలు అందుకున్నారు. లిటిల్ హార్ట్స్ వారికి అదిరే ఆరంభాన్నిచ్చింది. ఆ తర్వాత ‘రాజు వెడ్స్ రాంబాయి’ కూడా మరో మంచి సక్సెస్ అందించింది. డివైడ్ టాక్ తెచ్చుకున్న ‘ఈషా’ అనే హార్రర్ మూవీ సైతం మంచి ఫలితాన్నందుకుని వీరి కాంబినేషన్‌కు క్రేజ్ పెంచింది. వాసు, వంశీ కలిశారంటే హిట్టే అన్న అభిప్రాయం ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుల్లోనూ బలపడింది.

ఐతే మధ్యలో ‘మిత్రమండలి’ సినిమా ఒకటి మిస్ ఫైర్ కాగా.. దాన్ని వాళ్లు పెద్దగా పట్టించుకోలేదు. కానీ గత మూడు వారాల్లో ఈ జోడీ రెండు షాక్‌లు తింది. గత నెలలో సుహాస్ సినిమా ‘హే బల్వంత్’ను వాసు, వంశీలే రిలీజ్ చేశారు.

రిలీజ్‌కు ముందు దీనికి మంచి బజ్ క్రియేట్ అయింది. కానీ సినిమాలో బలమైన కంటెంట్ లేకపోవడంతో తొలి రోజే బాక్సాఫీస్ దగ్గర గుడ్లు తేలేసింది. ఇక గత శుక్రవారం వచ్చిన ‘సంప్రదాయిని సుప్పిని శుద్ధపూసని’ కూడా వీళ్లు రిలీజ్ చేసిన సినిమానే. ‘లిటిల్ హార్ట్స్’, ‘రాజు వెడ్స్ రాంబాయి’ తర్వాత ఈటీవీ విన్‌ నుంచి వచ్చిన ఈ చిత్రం మీద మంచి అంచనాలే ఏర్పడ్డాయి. నిజానికి గత నెలలో ఓటీటీలో రిలీజ్ కావాల్సిన సినిమా ఇది.

కానీ థియేటర్లలో అద్భుతాలు చేసేస్తుందని.. డిజిటల్ రిలీజ్ ఆపి మరీ ఈ నెల 6న బిగ్ స్క్రీన్లలోకి తీసుకొచ్చారు. కానీ ఈ చిత్రం మినిమం ఇంపాక్ట్ చూపించలేకపోయింది. తొలి రోజే తిరస్కరణకు గురైంది. అనవసరంగా ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేశారనే అభిప్రాయం కలిగించింది.

ఈటీవీ విన్ వాళ్లు మంచి సినిమాలు తీస్తే.. తాము బాగా లాభాలు తెచ్చుకుంటున్నామని వాసు ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో చెప్పాడు. కానీ ఈసారి ఈ మూవీ నుంచి వాసు, వంశీలకు వచ్చిందేమీ లేదు. వరుసగా రెండు సినిమాలు వాషౌట్ కావడంతో వాసు, వంశీ‌ల బ్రాండు కొంచెం దెబ్బ తిన్నట్లే కనిపిస్తోంది.