ఫోన్ ట్యాపింగ్ కేసుకు ఇప్పట్లో ముగింపు లేదా?

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం కేసును రెండేళ్ల నుంచి కార్తీక దీపం సీరియల్ మాదిరి లాగుతున్నారని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కేటీఆర్, హరీశ్ రావు, సంతోష్ రావు, కేసీఆర్ లను విచారణ జరిపారు. ఈ క్రమంలోనే ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఐపీఎస్, తెలంగాణ మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీం కోర్టు భారీ ఊరటనిచ్చింది.

అరెస్టు నుంచి ప్రభాకర్ రావుకు మినహాయింపునివ్వాలని సుప్రీం కోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, దర్యాప్తును ఆయన సహకరించాల్సిందేనని సుప్రీం తేల్చి చెప్పింది. అంతేకాదు, సాక్ష్యాలు, ఆధారాలు ట్యాంప్ చేయడం, సాక్ష్యులను ప్రభావితం వంటి పనులు చేస్తే ముందస్తు బెయిల్ రద్దవుతుందని హెచ్చరించింది. ఇక, ట్రయల్ కోర్టు అనుమతి లేనిదే ఎక్కడికీ వెళ్లకూడదని ఆదేశించింది.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డీఐజీ హోదాలో ఉన్న ప్రభాకర రావును 2016లో ఎస్ఐబీ చీఫ్ గా కావాలనే అప్పటి ప్రభుత్వం నియమించిందని ఆరోపణలున్నాయి. బీఆర్ఎస్ సర్కార్ కు అనుకూలంగా ఆయన వ్యవహరించి పలువురి ఫోన్లు ట్యాప్ చేయించారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

అయితే, రిటైర్ అయిన తర్వాత ప్రభాకర్ రావును కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా…ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు ఇప్పట్లో ముగింపు లేనట్లే కనిపిస్తోంది.