పెద్దావిడ ఖాతాలో 50 కోట్ల బ్లాక్ బస్టర్

కాదేది కంటెంట్ కు అనర్హం అంటారు సినీ పెద్దలు. ఇది అక్షరాలా నిజం. డిజిటల్ యుగంలో కేవలం స్టార్ ఎలివేషన్లతోనే సినిమాలు నడవవు. జనాలకు నచ్చేలా తీస్తే ఎవరున్నారో కూడా పట్టించుకోకుండా కనక వర్షం కురిపిస్తారు. దానికి సాక్ష్యంగా ఇటీవలే విడుదలైన తమిళ చిత్రం తాయ్ కిళవి నిలుస్తోంది. రాధికా శరత్ కుమార్ టైటిల్ పోషించిన ఈ మూవీ కేవలం రెండు వారాలకే యాభై కోట్లు దాటడం విశేషం.

సింపుల్ కథతో రూపొందిన ఈ ఎమోషనల్ డ్రామాకు శివ కార్తికేయన్ నిర్మాతగా వ్యవహరించారు. ప్రవర్తన సరిగా లేని కొడుకులను బయటికి పంపించిన పెద్దావిడ ఊళ్ళో వడ్డీలకు డబ్బులు ఇచ్చి దర్జాగా తిరుగుతూ ఉంటుంది. ఓసారి హఠాత్తుగా పక్షవాతం రావడంతో ఆమె దగ్గర బంగారు నిధి ఉందనే అనుమానంతో పోయినవాళ్లు తిరిగి వస్తారు. అక్కడి నుంచి అసలు స్టోరీ మొదలవుతుంది. అదే తెరమీద చూడాలి.

తాయ్ కిళవికి ఇంత స్పందన రావడానికి కారణం లేకపోలేదు. కోలీవుడ్ బాక్సాఫీస్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. జన నాయకుడు వాయిదా పడ్డాక ఒక్క సినిమా  బ్లాక్ బస్టర్ అయిన దాఖలాలు లేవు. జీవా టిటిటి ఒకటే కొంచెం ఊరట కలిగించగా మిగిలినవి చేతులు ఎత్తేశాయి. దీంతో రాధిక మూవీకి పెద్ద అడ్వాంటేజ్ దొరికింది. దానికి తగ్గట్టే టాక్ బాగుండటంతో ప్రేక్షకులతో సూపర్ హిట్ అందుకుంది.

ప్రస్తుతం తాయ్ కిళవిని ఇతర భాషల్లో డబ్బింగ్ చేసే ఆలోచన జరుగుతోందట. అయితే టైం తక్కువగా ఉండటం, మార్చి 19 దురంధర్ రివెంజ్, ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి పెద్ద రిలీజుల వల్ల ప్రభావం పడుతుందేమోనని భావించి ఇంకా నిర్ణయంతీసుకోలేదట. ఆ టైంకంతా ఓటిటి విడుదల దగ్గరగా ఉంటుంది కాబట్టి అనవసరంగా రిస్క్ తీసుకోవడం ఎందుకనే కోణం కూడా చూస్తున్నారు. ఇంత విజయం, ఇన్ని ప్రశంసలు సాధించిన ఈ సినిమా దర్శకుడు శివకుమార్ మురుగేషన్ కు ఇది డెబ్యూ మూవీ కావడం గమనార్హం.