తిరుప‌తిలో బీజేపీ గెలిస్తే ప‌వ‌న్‌కు రాజ్య‌స‌భ సీటా ?


తిరుప‌తి పార్ల‌మెంటు ఎన్నిక‌ల ప్ర‌చారం క్లైమాక్స్‌కు చేరుకుంది. ఈ ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి ప‌న‌బాక ల‌క్ష్మి, వైసీపీ నుంచి డాక్ట‌ర్ గురుమూర్తి, బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారి రత్నప్రభ పోటీ చేస్తున్నారు. అయితే ఇదే సీటు నుంచి ముందు జ‌న‌సేన పోటీ చేయాల‌ని అనుకున్నా.. చివ‌ర‌కు బీజేపీ ఒత్తిడికి త‌లొగ్గి సీటును త్యాగం చేయ‌క త‌ప్ప‌లేదు. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రావ‌డానికి ముందు ప‌వ‌న్ చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ప‌ర్య‌టించారు కూడా… అయినా చివ‌ర‌కు బీజేపీయే ప‌ట్టుబ‌ట్టి మ‌రి ఈ సీటు ద‌క్కించుకుంది.

తెలంగాణ‌లో గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లోనూ చివ‌రి వ‌ర‌కు పోటీ చేస్తాన‌ని ఊగిస‌లాడిన జ‌న‌సేన చివ‌ర‌కు పోటీ నుంచి త‌ప్పుకుని.. బీజేపీ నేత‌ల‌తో ఎన్నో అవ‌మానాలు ఎదుర్కొని మ‌రీ బీజేపీకే స‌పోర్ట్ చేసింది. ఈ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ పోటీ చేయ‌క‌పోవ‌డం కూడా బీజేపీకి చాలా ప్ల‌స్ అయ్యింద‌నే చెప్పాలి. తిరుప‌తిలో ప‌వ‌న్ సీటు త్యాగం చేసినందుకు గాను.. ఇక్క‌డ బీజేపీ గెలిస్తే ప‌వ‌న్‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చే ఆలోచ‌న‌లో బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇందుకు కార‌ణం ఏంటంటే.. ఏపీలో బీజేపీకి ఒక్క అసెంబ్లీ లేదా లోక్‌స‌భ సీటు కూడా లేదు.

ఇప్పుడు బీజేపీ ఈ ఎన్నిక‌ల్లో గెలిస్తే ప‌వ‌న్‌కు రాజ్య‌స‌భ సీటు ఇస్తే.. త‌మ‌కు మ‌రింత ప్ల‌స్ అవుతుంద‌న్న ఆలోచ‌న‌లో ఉంద‌ట‌. ఇక్క‌డ ర‌త్న‌ప్ర‌భ గెలిస్తే కేంద్ర మంత్రి ప‌ద‌వి ఇస్తార‌న్న ప్ర‌చారం ఉప ఎన్నిక‌ల నోటిపికేష‌న్‌కు ముందు భారీగా జ‌రిగింది. ఇప్పుడు అది కాస్త సైలెంట్ అవ్వ‌గా.. ప‌వన్‌కు రాజ్య‌స‌భ సీటు ప్ర‌తిపాదన‌ బాగా హైలెట్ అవుతోంది. ప‌వ‌న్‌కు రాజ్య‌స‌భ సీటు ఇస్తే అటు కాపు సామాజిక వ‌ర్గం అంతా బీజేపీకి మ‌రింత ప్ల‌స్ అవ్వ‌డంతో పాటు జ‌న‌సేన కేడ‌ర్ అంతా బీజేపీ ప‌ట్ల సానుకూల ధృక్ప‌థంతో ఉంటుంద‌న్న‌దే బీజేపీ ఆశ‌.

దీనిని క్యాష్ చేసుకునే వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి జ‌న‌సేన + బీజేపీ కూట‌మి మ‌రింత స్ట్రాంగ్‌గా ఎన్నిక‌ల్లో ఏపీలో సంచ‌ల‌నం క్రియేట్ చేస్తుంద‌ని బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం ఆశ‌. మ‌రోవైపు చంద్ర‌బాబు కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు స‌పోర్ట్‌గా మాట్లాడుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌తో క‌లిసి వెళితే త‌న‌కు అధికారం వ‌స్తుంద‌న్న ఆశ ఆయ‌న‌కు ఉంది. అందుకే ఇటీవ‌ల ప‌వ‌న్ వ‌కీల్‌సాబ్ సినిమాను ఏపీ ప్ర‌భుత్వం టార్గెట్ చేస్తోంద‌న్న వ్యాఖ్య‌ల‌తో ప‌వ‌న్ అభిమానుల మ‌న‌స్సు దోచుకునే ప్ర‌య‌త్నం చేశారు. అందుకే బీజేపీ ప‌వ‌న్‌కు రాజ్య‌స‌భ సీటు ఎత్తుతో ప‌వ‌న్ త‌మ‌ను వీడిపోకుండా ఉండేలా చేస్తోంద‌న్న చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో ? చూడాలి.