మహేష్ అభిమానులకు హరీష్ సారి

సోషల్ మీడియాలో చాలా అలెర్ట్ గా ఉండాలి. ముఖ్యంగా సెలబ్రిటీలు బిజీగా షెడ్యూల్స్ లో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా క్షణాల వ్యవధిలో నెగటివ్ విషయాలు వైరల్ అయిపోతాయి. నిన్న రాత్రి ఉస్తాద్ భగత్ సింగ్ ని ఉద్దేశించి ఒక అభిమాని బాబ్ రికార్డులు లేపేయాలనే అర్థం వచ్చేలా ట్వీట్ చేశాడు. దానికి స్పందించిన హరీష్ శంకర్ పూర్తిగా చదవకుండానే తధాస్తు అని బదులు ఇచ్చి రీ ట్వీట్ చేశారు. సెకండ్ల వ్యవధిలో జరిగిన తప్పును అర్థం చేసుకుని వెంటనే డిలీట్ చేశారు.

ఈలోగానే దాన్ని స్క్రీన్ షాట్లు, వీడియో రూపంలో క్యాప్చర్ చేసిన ఇతర ఫ్యాన్స్ దాన్ని వైరల్ చేశారు. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఆగ్రహం కలిగింది. రికార్డులు లేపేయాలని ఉద్దేశించి అతనెవరో పెట్టిన ట్వీట్ కి ఇలా రిప్లై ఇవ్వడం ఏమిటని హరీష్ ని నిలదీస్తూ ఆన్ లైన్ హంగామా చేశారు. డ్యామేజ్ చాలా దూరం వెళ్తోందని గుర్తించిన హరీష్ శంకర్ తాజాగా ఎక్స్ అకౌంట్ లో ఒక సుదీర్ఘమైన మెసేజ్ ద్వారా తన ఉద్దేశాలు వివరించి మనోభావాలు దెబ్బ తిన్న వాళ్లకు క్షమాపణ చెప్పారు.

ప్రాక్టికల్ గా చూసుకుంటే స్టార్లను హ్యాండిల్ చేస్తున్న దర్శకులు ఎవరూ ఇతర హీరోల మీద మాట లేదా ట్వీట్ జారరు. దాని వల్ల పరిణామాలు తెలిసి ఉంటాయి కాబట్టి. కానీ కేవలం తొమ్మిది రోజుల రిలీజ్ ఒత్తిడి పెట్టుకున్న హరీష్ శంకర్ ట్వీట్ ని పూర్తిగా చూసుకోకుండా ఉత్సాహంతో ఇచ్చిన సమాధానం వ్యవహారాన్ని చాలా దూరం తీసుకెళ్లింది. వివరణ సందేశంలో అదే చెప్పారు. వారణాసి గురించి, గతంలో పోకిరి గురించి తాను గొప్పగా చెప్పినవి అందులో ఉదహరించారు.

మొత్తానికి రాత్రి రచ్చ చేస్తున్న ఇష్యూ ఫైనల్ గా క్షమాపణ దగ్గర ఆగింది. గతంలో ఇదే తరహాలో ఒక అప్ కమింగ్ డైరెక్టర్ చిరంజీవిని ఉద్దేశించినట్టుగా ఉన్న పాత ట్వీట్ ఒకటి బయటికి తీస్తే దాన్ని ట్రోలింగ్ కోసం వాడుకున్న బ్యాచ్ పెద్దదే ఉంది. ఇలాంటివి పెద్దవి అయ్యేదాకా ఆగకూడదు. అందుకే హరీష్ శంకర్ వెంటనే డ్యామేజ్ కంట్రోల్ లోకి దిగిపోయారు. మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ కు చివరి దశ పనులు ఆఘమేఘాల మీద జరుగుతున్నాయి. సెన్సార్ అయిపోయింది కాబట్టి టెన్షన్ లేదు.