ఏదో ఒక రకంగా సానుభూతి పొందాలని.. ప్రతిపక్షం టీడీపీని బద్నాం చేయాలని కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్న వైసీపీ ఎంపీ.. ఉత్త రాంధ్ర జిల్లాల వైసీపీ ఇంచార్జ్.. జగన్‌కు రైట్ హ్యాండ్ విజయసాయిరెడ్డి ప్రయత్నాలు ఏ ఒక్కటీ ఫలించడం లేదు. పైగా ఆయనకే అవి తిరిగి ఎఫెక్ట్‌గా మారుతున్నాయి. తాజాగా సాయిరెడ్డి చేసిన మరో ప్రయత్నం ఉత్తుత్తిదేనని.. అనవసరంగా ఆయన తమ సమయం వృథా చేస్తున్నారని.. పార్లమెంటరీ స్థాయీ సంఘమే ఆరోపణ చేయడం గమనార్హం. విషయం ఏంటేంటే..
టీడీపీ హయాంలో 2017, జనవరి 26న విశాఖ ఎయిర్‌పోర్టులో తన దాడి జరిగిందని విజయసాయిరెడ్డి పార్లమెంటరీ స్థాయి సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆ రోజు విశాఖ ఆర్కే బీచ్‌లో ప్రత్యేక హోదా కోసం ర్యాలీ చేయడానికి ప్రజాసంఘాల సిద్ధమయ్యాయి. అప్పట్లో తమిళనాడులో జల్లికట్టు ఉద్యమం జరుగుతుండడంతో ఆ స్పూర్తితో అందరూ ముందుకు రావాలని సోషల్ మీడయాలో విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే చివరివరకు స్పందించకుండా ఉన్న వైసీపీ.. ఉద్యమానికి మంచి స్పందన వచ్చేసరికి జగన్, విజయసాయితో పాటు ముఖ్యనేతలు హైదరాబాద్‌లో విమానం ఎక్కి విశాఖలో దిగారు. అయితే అప్పటికే పోలీసులు ఆంక్షలు విధించారు.
విమానాశ్రయంలోను జగన్ బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఎయిర్‌పోర్టులో జగన్, విజయసాయి ధర్నాకు దిగారు. పోలీసులను తోసేశారు. తాము అధికారంలోకి వచ్చాక సంగతి చూస్తామని హెచ్చరించారు. ఈ ఘటనలో విజయసాయి చాలా దూకుడుగా వ్యవహరించారు. ఆయన పోలీసులను తోసేస్తున్న వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే.. పోలీసులే తనపై దాడి చేశారంటూ ఎంపీ హోదాలో రాజ్యసభ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన ప్రివిలేజ్ కమిటీ .. సుమారు రెండేళ్లపాటు(కరోనా టైం తప్ప) విచారణ జరిపింది. తాజాగా దీనితాలూకు నివేదికను చైర్మన్ వెంకయ్యనాయుడుకు సమర్పించింది.
దీనిలో విశాఖ ఎయిర్‌పోర్టులో విజయసాయిపై దాడి జరిగిందనడానికి సాక్ష్యాలు లేవని సభాహక్కుల సంఘం స్పష్టం చేసింది. అంతేకాదు.. సాయిరెడ్డి తప్పుడు ఫిర్యాదు చేశారని తేల్చింది. ఆయనపై దాడికి ఆధారాలు లేవని తెలిపింది. ఇక, ఈ ఘటనపై ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. మొత్తానికి.. ఢిల్లీలోనూ సాయిరెడ్డి పరువు పోయిందని.. ఇకపై ఎలాంటి ఫిర్యాదులు చేసినా.. పెద్దగా ప్రాధాన్యం దక్కే అవకాశం కూడా ఉండదని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates