ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును మరింత ఉద్ధృతం చేసింది. ఇప్పటికే వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసిన ఈడీ, తాజాగా ఆ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డికీ నోటీసులు పంపింది.
ఈ నెల 23న విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. అంతకుముందు 22న విజయసాయిరెడ్డి విచారణకు రావాలని కోరిన ఈడీ, వరుసగా మిథున్‌రెడ్డిని పిలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. జగన్ పాలనలో లిక్కర్ విధాన రూపకల్పన, అమలులో విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి కీలకంగా వ్యవహరించాలని దర్యాప్తు వర్గాలు ఆరోపిస్తున్నాయి.
లిక్కర్ స్కాంలో విజయసాయిరెడ్డి ఏ5 నిందితుడిగా ఉన్నప్పటికీ, ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌కు సహకరిస్తున్న కారణంగా ఆయనను అరెస్టు చేయలేదని తెలుస్తోంది. మరోవైపు, మిథున్‌రెడ్డి మాత్రం సిట్ విచారణలో కీలక నిందితుడిగా మారారు. సుప్రీంకోర్టు వరకు వెళ్లినా ఉపశమనం లభించక, ఆయనను సిట్ అరెస్టు చేసింది.
అనంతరం ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చారు. 2025లో వెలుగుచూసిన ఈ కుంభకోణంలో మిథున్‌రెడ్డి పాత్ర, ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని సిట్ ఆరోపించింది. అధికారులను ప్రభావితం చేయడం, కీలక సమావేశాల్లో పాల్గొనడం, రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగేలా నిర్ణయాలు తీసుకోవడంలో భాగస్వామ్యం అయ్యారన్న అభియోగాలు నమోదు చేసింది.
లిక్కర్ స్కాం డబ్బుల మనీలాండరింగ్‌లో మిథున్‌రెడ్డి కీలక పాత్ర పోషించారన్న అంశంపై ఈడీ దృష్టి సారించినట్లు సమాచారం. స్కాం డబ్బుల సేకరణ, వాటి రూటింగ్, పైస్థాయికి లెక్కలు చేరవేయడంలో ఆయన పాత్ర ఉందన్న ఆరోపణలను ఈడీ విచారణలో వెలికితీయనుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మరోవైపు, వరుసగా ఇద్దరు కీలక నేతలను విచారణకు పిలవడంతో లిక్కర్ స్కాంలో ఈడీ దర్యాప్తు మరింత వేడెక్కిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
