పోలీసుల ప్ర‌శ్న‌ల‌కు పోసాని ‘సినిమాటిక్‌’ స‌మాధానాలు!

ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లా రాయ‌చోటి నియోజ‌క‌వ‌ర్గం, ఓబులవారి ప‌ల్లె పోలీసుల అదుపులో ఉన్న సినీ న‌టుడు, వైసీపీ మాజీ నాయ‌కుడు(తాను రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్న‌ట్టు గ‌తంలోనే ప్ర‌క‌టించారు) పోసాని కృష్ణ ముర‌ళిని ఎస్పీ ఆధ్వ‌ర్యంలో గురువారం మ‌ధ్యాహ్నం 11 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌రకు విచారించారు. గ‌తంలో అటు సోష‌ల్ మీడియాలోనూ.. ఇటు సాధార‌ణ మీడియా ముందు కూడా.. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు, కాపులు-క‌మ్మ‌లు అంటూ చేసిన కామెంట్లు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ల‌క్ష్యం గా చేసుకుని చేసిన విమ‌ర్శ‌ల‌పై ఆయ‌న‌ను విచారించారు.

అయితే.. పోలీసులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు పోసాని సినిమాటిక్‌లో స‌మాధానాలు చెప్పిన‌ట్టు తెలిసింది. మీరు చేసిన వ్యాఖ్య‌ల‌తో స‌మాజంలో క‌ల్లోలం రేపేందుకు ఎందుకు ప్ర‌య‌త్నించారు? అన్న ప్ర‌శ్న‌కు.. “ఔనా రాజా” అంటూ ఆయ‌న ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసిన‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా తెలిసింది. అంతేకాదు.. ఏ ప్ర‌శ్న అడిగినా.. త‌న‌కు తెలీదని, కొన్ని కొన్ని గుర్తు ఉండ‌డం లేద‌ని.. వ‌యసు మీరిపోయింద‌ని.. తాత‌ను అయ్యాన‌ని ఇలా పొంత‌న‌లేని స‌మాధానాలు చెప్ప‌డంతో పోలీసులు చిర్రెత్తిపోయిన‌ట్టు స‌మాచారం.

ఎంత విసిగించినా.. సెల‌బ్రిటీ కావ‌డంతో చాలా సంయ‌మ‌నంతో పోలీసులు వ్య‌వ‌హ‌రించిన‌ట్టు అధికార వ‌ర్గాలు తెలిపాయి. రాష్ట్ర డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన నేత జోగినేని మణి రెండు రోజుల క్రితం ఇచ్చిన ఫిర్యాదుపై ఓబులవారిపల్లె పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ క్ర‌మంలోనే బుధవారం రాత్రి హైద‌రాబాద్‌లోని రాయదుర్గంలో ఉన్న ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు అరెస్టు చేశారు.

గురువారం ఉద‌యం స్థానికంగా వైద్య పరీక్షలు చేయించి.. ఆరోగ్యం బాగానే ఉంద‌ని ధ్రువీక‌రించుకున్నా క‌.. ఎస్పీ ఆధ్వ‌ర్యంలో పోసానిని విచారించారు. విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు.. అధికారుల కీల‌క ప్ర‌శ్న‌లు ఇవీ..

  • అధికారి: కాపు సామాజిక వ‌ర్గాన్ని రెచ్చ‌గొట్టేలా ఎందుకు మాట్లాడారు?
    పోసాని: వాళ్లెవ‌రు? ఎక్క‌డుంటారు? నాకు తెలియ‌దే! (ఈసంద‌ర్భంగా గ‌త వీడియో చూపించారు.) దీనికి “ల‌వ్ యూ రాజా.. మంచి టైమ్ పాస్‌” అని వ్యాఖ్యానించిన‌ట్టు తెలిసింది.
  • అధికారి: రాజ‌కీయాల్లోకి ఎప్పుడు వ‌చ్చారు?
    పోసాని: వాటితో నాకు సంబంధం లేదు. రాజ‌కీయాల‌కు నాకు ప‌డ‌దు. (స్ట్ర‌యిట్ ఆన్స‌ర్‌)
  • అధికారి: డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌గారిపై మీ అభిప్రాయం?
    పోసాని: ఆయ‌నెవ‌రు? ఆయ‌న‌ను ఇప్ప‌టి వ‌ర‌కు నేను చూడ‌లేదు. ఆయన పేరు కూడా నాకు తెలీదు. (ఈసంద‌ర్భంగా గ‌తంలో ప‌వ‌న్‌ను విమ‌ర్శించిన‌ వీడియో చూపించారు.) దీనిపై “మ‌రిచిపోయా” అంటూ పోసాని ఆన్స‌ర్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం.