జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి నష్టం కలిగించాయని భావిస్తున్న ప్రభుత్వం, ఆ కాలంలో తీసుకున్న నిర్ణయాలపై సుదీర్ఘ సమీక్షలు నిర్వహిస్తోంది. ఇప్పటికే కొన్ని నిర్ణయాలను రద్దు చేసిన ప్రభుత్వం, తాజాగా రాజధాని అమరావతికి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది.
వైసీపీ హయాంలో రాజధాని కోర్ ఏరియాలోని ఐదు జోన్లలో ఐదవ జోన్ అయిన ఆర్ 5ను పేదలకు కేటాయించారు. వాస్తవానికి ఈ భూములు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారుల కోసం ఉద్దేశించినవి. అయితే జగన్ అన్న ఇళ్ల కాలనీల పేరుతో అప్పటి ప్రభుత్వం ఈ భూములను పేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించింది. అప్పట్లోనే టీడీపీతో పాటు రైతులు కూడా దీనిపై న్యాయపోరాటం ప్రారంభించారు. ఆ విషయం ఇప్పటికీ పెండింగ్ లోనే ఉంది.
ఇప్పటికే రాజధానికి పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో, ఈ భూములను మళ్లీ పరిశ్రమల కోసం వినియోగించాలనే నిర్ణయం తీసుకున్నారు సీఎం చంద్రబాబు. ఆర్ 5 జోన్ కు సంబంధించిన పేదలకు కేటాయించిన జీవోను రద్దు చేయాలని నిర్ణయించారు.
ఆర్ 5 జోన్ లోని 1400 ఎకరాల భూములను రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ సీఆర్ డీఏకు తిరిగి అప్పగించనున్నారు. ఈ భూములను పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి కేటాయించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు వెళుతోంది.
అయితే పేదలకు అన్యాయం జరగకుండా, గతంలో పత్తాలు పొందిన వారికి వారి వారి జిల్లాల్లో డబుల్ స్థాయిలో భూములు కేటాయించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
ఉగాది నాటికి పూర్తి
రాజధాని ప్రాంతంలో గతంలో భూములు పొందిన పేదలకు వారి జిల్లాల్లోనే డబుల్ స్థాయిలో భూములు కేటాయించే ప్రక్రియను ఉగాది నాటికి మార్చి 19 లోగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. రెవెన్యూ శాఖకు తక్షణమే సూచనలు జారీ చేశారు.
దాదాపు 50 వేల పేద కుటుంబాలకు రెండు సెంట్ల చొప్పున భూములు కేటాయించనున్నారు. ఒకవేళ భూములు వద్దనుకునే వారికి టిడ్కో ఇళ్లను ఇవ్వాలని కూడా నిర్ణయించారు.
రాజధాని అభివృద్ధిని కాపాడుతూ, పేదల ప్రయోజనాలను కూడా పరిరక్షించేలా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates