యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా కొట్టాయి. ముందు సినిమాలు బాలేక ఆడలేదు కానీ.. తన చివరి చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ మంచి టాక్ తెచ్చుకుని కూడా బాక్సాఫీస్ ఫెయిల్యూర్‌గానే నిలిచింది. ఇది అతణ్ని ఎంతో బాధ పెట్టి ఉంటుందనడంలో సందేహం లేదు.
ఐతే ఈసారి రామ్ సొంత కథతో సినిమా చేస్తున్నాడని.. ఇంకేదో థ్రిల్లర్‌ను లైన్లో పెడుతున్నాడని రకరకాల వార్తలు వచ్చాయి. ఆర్క మీడియా సంస్థతో తన కొత్త చిత్రం ఉంటుందని కూడా ప్రచారం జరిగింది. కానీ ఇవన్నీ పక్కకు వెళ్లిపోయాయన్నది తాజా సమాచారం. తనకు ‘నేను శైలజ’ లాంటి మరపురాని సినిమాను అందించిన కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ నటించబోతున్నట్లు తెలుస్తోంది.
ఇటీవలే రవితేజతో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా తీశాడు కిషోర్ తిరుమల. ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. ఐతే కిషోర్ గత చిత్రం ‘ఆడవాళ్లూ మీకు జోహార్లు’తో పోలిస్తే ఇది మెరుగైన ఫలితమే అందుకుంది.
రామ్‌తో తీసిన ‘నేను శైలజ’ కిషోర్ కెరీర్ బెస్ట్ ఫిలిం. ఆ తర్వాత వీరి కలయికలో వచ్చిన ‘ఉన్నది ఒకటే జిందగీ’ సరిగా ఆడలేదు. ‘రెడ్’ పర్వాలేదనిపించింది. ఇప్పుడు ‘నేను శైలజ’ తరహాలోనే ఒక మంచి ప్రేమకథ చేద్దామని రామ్, కిషోర్ చూస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుగుతోంది.
ఈ చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్‌లో చేయాలన్నది రామ్ ఆలోచనగా తెలుస్తోంది. ఈ లెజెండరీ బేనర్ మీద రామ్ పెదనాన్న రవికిషోర్ ఎన్నో గొప్ప సినిమాలు తీశారు. ఈ మధ్య ఆయన ప్రొడక్షన్‌కు దూరంగా ఉన్నారు. రామ్, కిషోర్ సినిమాతో రీఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates