ప్రభాస్ మాట సాయం… కపుల్ నడకలో వేగం

గత వారం విడుదలైన సినిమాల్లో మంచి టాక్, రివ్యూస్ తెచ్చుకుంది కపుల్ ఫ్రెండ్లీకి ఒకటే. అయితే ఆశించిన పెద్ద మొత్తంలో ఆ రెస్పాన్స్ కలెక్షన్లుగా మారలేదు. హైదరాబాద్ లాంటి నగరాల్లో నెంబర్లు కనిపించాయి కానీ బిసి సెంటర్స్ లో పోరాడుతున్న వైనం స్పష్టం. అందుకే బుక్ మై షోలో కూడా మొన్నటి దాకా రోజుకు కేవలం పది నుంచి పన్నెండు వేల టికెట్లు అమ్ముతూ ఎదురీదింది.

ప్రభాస్ తో ఇంటర్వ్యూ విడుదల చేశాక మరి దాని ప్రభావమో లేక కొత్త రిలీజులు కూడా సోసోగా ఉండటమో ఏమో కానీ మొత్తానికి కపుల్ ఫ్రెండ్లీకి ఊపొచ్చింది. ఇప్పుడు గంటకు పన్నెండు వందలకు పైగా టికెట్లు అమ్ముడు పోతున్నాయి.

అంటే రోజు మొత్తం చూసుకుంటే ఈ సంఖ్య ఈజీగా ఇరవై వేలకు దాటొచ్చు. ఇది మరీ పెద్ద నెంబర్ కాదు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వేరే ఇతర సినిమాలు ఈ మాత్రం కూడా నమోదు చేయలేకపోవడం గమనించాలి. పైగా కపుల్ ఫ్రెండ్లీ ఎక్కువగా యూత్ కి కనెక్ట్ అయ్యే ఎమోషనల్ లవ్ స్టోరీ. ఫ్యామిలీస్ కి ఎక్కే ఎలిమెంట్స్ తక్కువగానే ఉన్నాయి.

అందులోనూ యోగిబాబు జోకులు తప్ప పెద్దగా కామెడీ కూడా లేదు. అలాంటప్పుడు యువత మద్దతు దొరికితేనే ఇలాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిలబడతాయి. సంతోష్ శోభన్ కి ఇది పెద్ద రిలీఫ్ ఇచ్చే రెస్పాన్స్. ఎందుకంటే గత చిత్రాలు మొదటి వీకెండ్ కే చాప చుట్టేశాయి కాబట్టి.

ఇప్పుడీ వీకెండ్ కపుల్ ఫ్రెండ్లీకి కీలకం కానుంది. కలెక్షన్లు కనక స్టడీగా ఉంటే ఇంకో వన్ వీక్ స్పేస్ దొరుకుతుంది. అమాంతం పెరగకపోయినా కొంత స్థిరత్వం ఉండటం షోలు రన్ అయ్యేలా చేస్తుంది. ప్రభాస్ ఇంటర్వ్యూ తాలూకు క్లిప్పులు మాత్రం బాగా ఉపయోగపడుతున్నాయి.

డార్లింగ్ ఫుడ్ ముచ్చట్లు, చెన్నై నుంచి విమానంలో ఆహరం తెప్పించడాలు, పూరి జగన్నాథ్ గురించి చెప్పిన కబుర్లు ఇలా ఎన్నో విశేషాలు వైరల్ కంటెంట్ అయ్యాయి. గీతాంజలితో పోలుస్తూ కపుల్ ఫ్రెండ్లీకి కాంప్లిమెంట్ ఇవ్వడం చిన్న విషయం కాదు. ఏదైతేనేం ఇవన్నీ కపుల్ నడకలో వేగం పెరిగేందుకు ఉపయోగపడుతున్నాయి.