ఒక్క లుక్‌తో మంటలు పుట్టించిన రుక్కు

కొందరు హీరోయిన్లు కెరీర్ ఆరంభంలో చేసిన సంప్రదాయ పాత్రల కారణంగా వారి మీద ఒక ముద్ర పడిపోతుంది. వాళ్లను గ్లామర్ కోణంలో చూడరు. ఆ తర్వాత కూడా వారికి పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్, ట్రెడిషనల్ రోల్సే వస్తుంటాయి. కానీ ఇలాంటి ముద్ర వేయించుకోడానికి హీరోయిన్లు ఇష్టపడరు. కాబట్టి తమ లుక్ మారుస్తుంటారు. గ్లామర్ సొబగులు అద్దుకుంటూ ఉంటారు. 

దీంతో క్రమంగా వారిని చూసే కోణం మారిపోతుంది. పాత్రలు కూడా మారుతుంటాయి. కీర్తి సురేష్ కెరీర్లో చాన్నాళ్లు ఈ ‘ట్రెడిషనల్’ జోన్లోనే ఉండిపోయింది. కానీ గత కొన్నేళ్లుగా ఆమె ఎంత గ్లామరస్‌గా కనిపిస్తోందో తెలిసిందే. అందుకు తగ్గట్లే పాత్రలు కూడా మారుతున్నాయి. ఇప్పుడు కన్నడ భామ రుక్మిణి వసంత్ కూడా ఈ బాటలోనే నడుస్తున్నట్లు కనిపిస్తోంది.

‘సప్త సాగరాలు దాటి’ లాంటి కల్ట్ లవ్ స్టోరీతో కథానాయికగా పరిచయం అయింది రుక్మిణి. ఆమె సినిమా అంతా చుడీదార్లలో సగటు అమ్మాయిలా కనిపించింది. తన అభినయం అందరినీ కట్టిపడేసింది.

ఆ సినిమా తర్వాత రుక్మిణికి అవకాశాలు వరుస కట్టాయి కానీ.. అవన్నీ పెర్ఫామెన్స్ ఓరియెంటెడే. గ్లామర్ టచ్ తక్కువ. ఐతే ‘కాంతార: చాప్టర్-1’లో గ్లామర్, పెర్ఫామెన్స్ రెంటితోనూ ఆకట్టుకున్న రుక్మిణి.. ఇటీవల బయట ఈవెంట్లలో కనిపించేటపుడు సరికొత్త లుక్‌తో దర్శనమిస్తోంది. 

తాజాగా ఒక అవార్డు వేడుకలో ఆమె స్టైలింగ్ చూసి అందరూ షాకైపోయారు. కెరీర్లో ఎన్నడూ లేనంత గ్లామరస్‌గా తయారై వచ్చిన రుక్మిణి.. ఇంటర్నెట్‌ను తుపానులా ముంచెత్తింది.

రుక్కులో ఈ కోణం చూడలేదంటూ కుర్రకారు వెర్రెత్తిపోతున్నారు. బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్‌తో పోలుస్తూ.. ఆమెను మించిన ఫిజిక్, గ్లామర్ అంటూ రుక్మిణిని కొనియాడుతున్నారు. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో రుక్మిణి ఫొటోలు మామూలుగా వైరల్ కావట్లేదు.