మార్కో అంద‌రినీ చెడగొట్టేసాడా?

గ‌త ఏడాది మ‌ల‌యాళంలో ఎవ్వ‌రూ ఊహించ‌ని స్థాయిలో భారీ హిట్ అయింది మార్కో మూవీ. తెలుగులో జ‌న‌తా గ్యారేజ్, భాగ‌మ‌తి లాంటి చిత్రాల్లో క్యారెక్ట‌ర్ రోల్స్ చేసిన ఉన్ని ముకుందన్ ఇందులో హీరో. ఇదేమీ గొప్ప సినిమా కాదు. కానీ వ‌యొలెన్స్‌ను పీక్స్‌కు తీసుకెళ్లిన ఈ చిత్రాన్ని యూత్ ఎగ‌బ‌డి చూశారు.

ఇండియన్ ఫిలిం హిస్ట‌రీలోనే మోస్ట్ వ‌యొలెంట్ మూవీ ఇదే అంటే అతిశ‌యోక్తి కాదు. ఆ స్థాయిలో ఇందులో హింసాత్మ‌క స‌న్నివేశాలుంటాయి. ఎక్కువ‌గా సున్నిత‌మైన సినిమాలు తీసే మాలీవుడ్‌లో ఇలాంటి సినిమా రావ‌డం, దానికి అంత పెద్ద విజ‌యం ద‌క్క‌డం ఆశ్చ‌ర్య‌మే.

ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేస్తే మ‌న ప్రేక్ష‌కులకు అది పెద్ద‌గా న‌చ్చ‌లేదు. ఐతే మార్కో మల‌యాళంలో పెద్ద హిట్ కావ‌డం వేరే ఇండ‌స్ట్రీల మీద బాగానే ప్ర‌భావం చూపిన‌ట్లు క‌నిపిస్తోంది. వ‌యొలెన్స్ విష‌యంలో అంద‌రూ ఇప్పుడు బోర్డ‌ర్లు దాటేస్తున్నారు.

గ‌త ఏడాది వ‌చ్చిన నాని మూవీ హిట్‌-3లో వ‌యొలెన్స్ చూసి అంద‌రూ ముక్కున వేలేసుకున్నారు. ఫ్యామిలీ హీరోగా పేరున్న నాని నుంచి ఇంత హింసేంటి అనుకున్నారు. అదంతా మార్కో ప్ర‌భావం లాగే క‌నిపించింది. ఇక గత రెండు రోజ‌లు వ్య‌వ‌ధిలో వ‌చ్చిన రెండు టీజ‌ర్లు చూస్తే.. మార్కో ఎలాంటి ఎఫెక్ట్ చూపించిందో అర్థ‌మ‌వుతుంది.

విశ్వ‌క్సేన్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిస్తున్న క‌ల్ట్ మూవీ టీజ‌ర్ చూసి అంద‌రూ నోరెళ్ల‌బెట్టేశారు. స్క్విడ్ గేమ్ స్ఫూర్తిగా తెర‌కెక్కిన‌ట్లుగా కనిపిస్తున్న ఈ సినిమాలో ర‌క్త‌పాతం మామూలుగా లేదు. శ‌రీర అవ‌య‌వాలు తెగిప‌డిపోయే సీన్లు చూస్తే క‌డుపులో దేవ‌కుండా ఉండ‌దు. మెజారిటీ ప్రేక్ష‌కుల నుంచి ఈ స‌న్నివేశాల ప‌ట్ల వ్య‌తిరేక‌తే వ్య‌క్త‌మ‌వుతోంది. హింస మ‌రీ ఈ స్థాయిలోనా, తెలుగు సినిమాలో ఇదేంటి అనే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి.

దీని కంటే ఒక రోజు ముందు క‌న్న‌డ స్టార్ య‌శ్ న‌టించిన టాక్సిక్ టీజ‌ర్ లాంచ్ అయింది. అందులో కూడా హింస మోతాదు చాలా ఎక్కువే. ర‌క్తంతో స్క్రీన్ల‌ను త‌డిపేయ‌బోతున్నార‌ని ఇందులో కొన్ని సీన్లు సంకేతాలు ఇచ్చాయి. కొన్ని షాట్స్ ఒళ్లు గ‌గుర్పొడిచేలా చేశాయి. యంగ్ య‌శ్ క్యారెక్ట‌ర్ యానిమ‌ల్ మూవీ చివ‌ర్లో ర‌క్త‌పాతం సృష్టించిన ర‌ణ‌బీర్‌ను గుర్తుకు తెచ్చింది.

మితిమీరిన హింస ఉంటే యూత్ బాగా చూస్తార‌నే ఒక అభిప్రాయాన్ని మార్కో ఇండియ‌న్ ఫిలిం ఇండ‌స్ట్రీలో క‌లిగించిందా అనిపిస్తోంది టాక్సిక్, క‌ల్ట్ లాంటి సినిమాల ప్రోమోలు చూస్తే. ఈ సినిమాలు బాగా ఆడితే.. మున్ముందు వ‌యొలెన్స్ డోస్ ఇంకా పెరిగిపోతుందేమో.