అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్ వచ్చింది కానీ లేదంటే ఈ పాటికి కొంత భాగం పూర్తయ్యేది. వచ్చే నెల నుంచి షూటింగ్ చేయబోతున్నారు. ఇదిలా ఉండగా దీని తర్వాత బాలయ్య ఎవరితో చేస్తారనే దాని మీద రకరకాల ఊహాగానాలున్నాయి.
వాటిలో మొదటి పేరు హరీష్ శంకర్. ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజయ్యాక తను ఎవరితో చేతులు కలుపుతాడనే దాని మీద క్లారిటీ లేదు. ఈ మధ్య వివేక్ ఆత్రేయ పేరు కూడా వినిపిస్తోంది. సరిపోదా శనివారం తర్వాత అతను బాలయ్యతోనే చేసే అవకాశముందని కొన్ని వర్గాల నుంచి బలంగా వినిపిస్తోంది. ఇవి కాకుండా మార్కో ఫేమ్ హనీఫ్ అదేనితో నిర్మాత దిల్ రాజు ఒక కమిట్ మెంట్ తీసుకున్నారు. అది ప్రాధమికంగా బాలయ్య కోసమేనని టాక్.
కానీ ఇప్పుడు కాంబో మారిపోవచ్చని వినికిడి. దిల్ రాజు కాంపౌండ్ లో పని చేసిన సూర్య అనే డెబ్యూ డైరెక్టర్ చెప్పిన కథ నచ్చడంతో బాలయ్య దానికి సానుకూలంగా ఉన్నారని వినిపిస్తోంది. ఇంకా నిర్ధారణ కాలేదు కానీ ఒకవేళ కన్ఫర్మ్ అయితే హనీఫ్ అదేనితో వేరే హీరో కలయిక ఉంటుంది.
బాలయ్య కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వడం చాలా అరుదు. చివరిసారి 2015లో లయన్ ద్వారా సత్యదేవ్ ని పరిచయం చేశారు. కానీ దారుణంగా పోయింది. అంతకు ముందు చలసాని రామారావు, రవిభారతి – వాసులకు ఛాన్సులు ఇచ్చారు కానీ ఆశించిన ఫలితాలు రాలేదు. అందుకే బాలయ్య డెబ్యూలకు దూరంగా ఉంటారు.
మరి సూర్య చెప్పిన స్టోరీ అంత ఎగ్జైటింగ్ ఉందేమో చూడాలి. ప్రస్తుతానికి ఇది గాసిప్ గానే ఉంది కాబట్టి అఫీషియల్ ముద్ర వేయలేం కానీ చర్చల దశలో ఉన్న మాట నిజమేనట. ఇది పక్కన పెడితే బాలయ్య లైనప్ లో ఆదిత్య 999 మ్యాక్స్ ఉంది. దాని బాధ్యతలు క్రిష్ కు ఇస్తారనే ప్రచారం తొలుత జరిగినా ఘాటీ డిజాస్టర్ తర్వాత ఇష్యూ సైడ్ అయిపోయింది.
మరి స్వీయ దర్శకత్వంలో ఆయనే తీస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇంకోవైపు అనిల్ రావిపూడి కాంబో రిపీట్ కావాలని ఫ్యాన్స్ తో పాటు దర్శకుడూ కోరుకుంటున్నారు. మరి చివరికి ఏవి ఫైనల్ అవుతాయో ఏవి ప్రచారాల దగ్గరే ఆగిపోతాయో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates