నందమూరి బాలకృష్ణపై ప్రశంసల జల్లు కురిపించారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్. సనాతన ధర్మ యాత్రను ముగించుకుని శనివారం విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహిస్తున్న యుఫోరియా మ్యూజికల్ కన్సర్ట్‌కు అతిథిగా విచ్చేసిన పవన్.. తన ప్రసంగంలో బాలయ్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలయ్య ఎప్పుడూ తనను బాలయ్యా అని పిలవమని అంటుంటారని.. కానీ తనకు మాత్రం అలా పిలవబుద్ధి కాదని.. ఆయన తనకు ఎప్పుడూ సారే అని పవన్ వ్యాఖ్యానించడంతో సభా ప్రాంగణంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ బాలయ్యను మరింతగా ప్రశంసల్లో ముంచెత్తారు పవన్. బాలయ్య ఏదో ఒక తరంతో ఆగిపోకుండా కొన్ని తరాలుగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారని పవన్ అన్నారు. ఆయన నటన అందరికీ ఆనందాన్నిస్తుందన్నారు. నటనకే పరిమితం కాకుండా సేవా కార్యక్రమాలతో కూడా బాలయ్య ఎంతో పేరు తెచ్చుకున్నారని.. అందుకే నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆయన్ని ఇటీవల పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించిందని పవన్ అన్నారు.
బాలయ్య ఇప్పుడు జస్ట్ బాలయ్య కాదని, పద్మభూషణ్ బాలకృష్ణ అని పవన్ వ్యాఖ్యానించారు. ఇక ఎన్టీఆర్ ట్రస్ట్ చేపడుతున్న సేవా కార్యక్రమాల గురించి కూడా పవన్ కొనియాడారు. 28 ఏళ్లుగా ఈ ట్రస్టు కార్యక్రమాలు కొనసాగుతున్నాయని.. ఎన్టీఆర్ పేరు మీద పెద్దగా పబ్లిసిటీ లేకుండా సైలెంటుగా తమ పని తాము చేసుకుపోతుంటారని పవన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సైతం పాల్గొన్నారు.
ఇటీవల బాబుకు, పవన్‌కు మధ్య విభేదాలు వచ్చాయని.. సీఎంకు ఫోన్లోనూ డిప్యూటీ సీఎం దొరకట్లేదని వ్యతిరేక మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఈ వేడుకలో పవన్, బాబు, బాలయ్య, లోకేష్ ఎంతో సన్నిహితంగా కనిపించి ఈ ప్రచారానికి తెరదించారు.