ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో సంచలన ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు చోటు చేసుకోని విధంగా ఇక్కడ ఉన్నతాధికారులు ఒకరినొకరు బూతులు తిట్టుకుని.. ఒకరిపై ఒకరు చేయి చేసుకునే వరకు విషయం వెళ్లింది. దీంతో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన జరిగి రెండు రోజులు అయిన తర్వాత.. దీనికి సంబంధిం చిన సీసీ టీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది.
పిఠాపురం మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు.. తమ వార్డుల్లో పనులు చేయడం లేదని.. కనీసం చెత్త కూడా తీయడం లేదని ఆరోపించారు. దీనికి కమిషనర్ కనకారావు సమాధానం చెప్పాలని నిలదీశా రు. దీంతో ఆయన సమాధానం చెబుతూ.. డీఈఈ భవానీ శంకర్.. నిద్ర పోతున్నారని.. ఆయన అలసత్వం కారణంగానే పనులు నిలిచిపోతున్నాయని.. ఇప్పటికైనా.. ఆయన మేల్కొని రాష్ట్రంలో అధికారం మారిందన్న విషయాన్ని గుర్తించాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
సాధారణంగా కమిషనర్ ఉన్నత స్థాయి అధికారి. డీఈఈ ఆయన కింద పనిచేయాల్సి ఉంది. ఈ క్రమంలో ఒక మాట అన్నా కూడా.. డీఈఈ మౌనంగా ఉండాలి. ఈ సమయంలో డీఈఈ భవానీ శంకర్ ఎక్కడా వెనక్కి తగ్గకుండా.. కమిషనర్ కనకారావుపై రివర్స్ దాడి చేశారు. నీవల్లే ఎలాంటి పనులు కావడం లేదని.. నీ వల్ల అవినీతి పెరిగిపోయిందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ఇరువురు.. బూతులు తిట్టుకున్నారు. సహనం కోల్పోయిన.. డీఈఈ కమిషనర్‌పై చేయి చేసుకున్నారు.
దీంతో ఈ వ్యవహారం.. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నీయాంశం అయింది. సాధారణంగా.. ఎక్కడ కౌన్సిల్ సమావేశాలు జరిగినా అధికార ప్రతిపక్షాలకు చెందిన కౌన్సిలర్లు కీచులాడుకుంటారు. కానీ.. తొలి సారి పిఠాపురంలో ఇలా ఉన్నతాధికారులు డిష్యూం – డిష్యూంకు దిగడం వివాదంగా మారింది. మరి తన సొంత నియోజకవర్గంలో జరిగిన ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates