భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కరలేదు. గ్రామ స్థాయి బీజేపీ నేత నుంచి ఉప రాష్ట్రపతిగా ఎదిగి తెలుగు వారందరికీ గర్వకారణంగా నిలిచారు వెంకయ్య నాయుడు. హుందాతనంగా రాజకీయాలు చేసిన వెంకయ్యనాయుడు అంతే హుందాగా ఉప రాష్ట్రపతి పదవీ కాలం ముగిసిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకుండా తన మాట నిలబెట్టుకున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా నేడు వెంకయ్య నాయుడు జన్మదినం సందర్భంగా ఆయనపై రూపొందించిన మూడు పుస్తకాలను ప్రధాని మోదీ వర్చువల్ గా విడుదల చేశారు. గచ్చిబౌలిలో జరిగిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొన్న మోదీ..వెంకయ్య నాయుడిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘సేవలో వెంకయ్యనాయుడు జీవితం’, ‘13వ ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు లక్ష్యం, సందేశం’, ‘మహానేత వెంకయ్యనాయుడు జీవితం, ప్రయాణం’ అనే పుస్తకాలను మోదీ విడుదల చేశారు. ఈ సందర్భంగా వర్చువల్ గా ప్రసంగించిన మోదీ…వెంకయ్య నాయుడు గొప్ప వ్యక్తి అని, ఆయన జీవిత ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు.
ఈ పుస్తకాలు ప్రజలకు ప్రేరణగా నిలిచి మార్గనిర్దేశం చేస్తాయని అన్నారు. వెంకయ్య నాయుడుతో సుదీర్ఘకాలం కలిసి పనిచేసే అవకాశం తనకు దక్కిందని అన్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి 17 నెలల పాటు ఆయన జైలులో ఉన్నారని, కేంద్ర మంత్రిగా గ్రామీణ పట్టణాభివృద్ధి శాఖలో ఆయన తనదైన ముద్ర వేశారని కొనియాడారు. వెంకయ్య నాయుడి వాగ్ధాటి ముందు ఎవరూ నిలవలేరని అన్నారు.
ఈ సందర్బంగా వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం మాతృభాషలను ప్రోత్సహించడం గొప్ప విషయమని, అయితతే ఆంగ్ల భాషకు తాను వ్యతిరేకం కాదని చెప్పారు. మాతృభాష తర్వాతే ఇతర భాషలకు ప్రాధాన్యతనివ్వాలన్నారను. రిఫార్మ్, పర్‌ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్ నినాదంతో ప్రధాని మోదీ ముందుకెళ్తున్నారని కొనియాడారు.
చట్ట సభలకు ఎన్నికైన నేతలు హుందాగా వ్యవహరించాలని, పార్టీ మారడం తప్పు కాదని, కానీ పార్టీ ద్వారా పొందిన పదవులను వదిలేసి మరో పార్టీలోకి వెళ్లాలని సూచించారు. కులం, డబ్బు కాకుండా గుణం చూసి నాయకులకు ఓటు వేయాలని, రాజకీయాల్లో జవాబుదారీనం రావాలని ఆకాంక్షించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates