కాపు ఉద్యమ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.. దాదాపు వైసీపీలోకి చేరిపోయినట్టే. కేవలం ముహూర్తం మాత్రమే మిగిలి ఉంది. అనేక తర్జన భర్జనలు.. మీమాంసలు.. రాయబారాలు అనంతరం ఆయన ఫ్యాన్ కిందకు చేరిపోయారు. ఇది కొంత వరకు ముద్రగడను అభిమానించే వారికి క్లారిటీ ఇచ్చే సినట్టు అయిపోయింది. ఇప్పటి వరకు ముద్రగడ ఏ పార్టీకి జై కొడతారో తెలియక నాయకులు, కార్యకర్తలు గందరగోళంలో చిక్కుకున్నారు. ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది.
అయితే.. అసలు కథ ఇక్కడే ఉంది. అసలు ముద్రగడ.. వైసీపీలో చేరడం.. ఆయనకు ప్లస్సా.. మైనస్సా? అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఎందుకంటే.. నిన్నటి వరకు కూడా.. జనసేనలో చేరేందుకు సిద్ధమేనని ఆయన లీకులు ఇస్తూ వచ్చారు. పవన్‌కు బహిరంగ లేఖలు కూడా రాశారు. అంతేకాదు.. ఇటీవల జెండా సభ అనంతరం కూడా.. టికెట్లు, కేటాయింపు.. అభ్యర్థుల విషయంలో సీరియస్ కామెంట్లు చేస్తూ హీటెక్కించారు.
దీంతో అయ్యో.. ముద్రగడ చెబుతున్న సూచనలు కూడా జనసేన తీసుకోవడం లేదా? అనే చర్చ సాగింది . ముఖ్యంగా కాపుల్లో ఈ చర్చ జోరుగా సాగింది. అయితే.. ఈ చర్చ ఇలా కొనసాగుతున్న సమయంలోనే ముద్రగడ అనూహ్యంగా వైసీపీ బాట పట్టడంతో ఆయన ముసుగు తొలగించేసినట్టు అయిపోయింది. ఇప్పటి వరకు .. పవన్ సానుకూల.. జనసేన అనుకూల ముసుగులు ధరించి.. వైసీపీకి మేలు చేస్తున్నారన్న కొందరు విమర్శలకు తాజాగా బలం చేకూరినట్టు అయింది.
ఈ పరిణామం.. రాజకీయంగా వైసీపీకి మేలు చేస్తుందా..? లేదా? అనేది పక్కన పెడితే. వ్యక్తిగతంగా ఇప్పటి వరకు ముద్రగడ సంపాయించుకున్న ఇమేజ్, ముఖ్యంగా కాపుల్లోని పలు సామాజిక వర్గాల్లో ఆయనపై ఉన్న సానకూల దృక్ఫథం వంటివి మాత్రం మసకబారేలా చేశాయి. పార్టీల్లో చేరేందుకు ఆయనకు ఎలాంటి అడ్డు ఎవరూ చెప్పలేదు. పెట్టలేదు కూడా.
కానీ, ఇప్పటి వరకు సుదీర్ఘంగా తటస్థ నేతగా ఉన్నట్టుగా వ్యవహరించి.. జనసేనకు ఏదో మేలు చేస్తున్నట్టు చెప్పి.. అనూహ్యంగా వైసీపీకి జై కొట్టడం.. వ్యక్తిగతంగా ముద్రగడకు.. డేంజర్ బెల్స్ మొగిస్తున్నట్టేనని..ఆయన విశ్వసనీయతకు ఇది పెను ప్రమాదమేనని పరిశీలకులు చెబుతున్నారు.