పేర్నివారి పురాణాలు.. ప‌వ‌న్ గురించి ఏమ‌న్నారంటే..

వైసీపీ కీల‌క నేత‌, కాపు నాయ‌కుడు, మాజీ మంత్రి పేర్ని నాని.. తాజాగా ప‌వ‌న్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. జ‌న‌సేన అధినేత బుధ‌వారం నిర్వ‌హించిన జెండా స‌భ‌లో చేసిన కామెంట్ల‌కు కౌంట‌ర్ ఇచ్చేందుకు మీడియా ముందుకు వ‌చ్చిన‌.. నాని.. పురాణాల‌తో ప‌వ‌న్‌పై విరుచుకుప‌డ్డారు. ప‌వ‌న్ శ‌ల్యుడు, శిఖండి అని వ్యాఖ్యానించారు. “చంద్ర‌బాబుకు స‌రైన జోడీ దొరికింది. శ‌ల్య సార‌థ్యంలో ఆయ‌న ముందుకు సాగుతున్నాడు. త‌మ్ముళ్లే ఇక‌, తేల్చుకోవాలి” అని నాని అన్నారు.

అంతేకాదు.. ప్ర‌జల క్షేమం, రాష్ట్ర సంక్షేమం గురించి జెండా స‌భ‌లో ఒక్క మాట కూడా మాట్లాడ‌లేద‌ని నాని వ్యాఖ్యానించారు. అదేస‌మ‌యంలో కీల‌క‌మైన కాపుల ఆత్మగౌరవాన్ని పెంచే ఒక్క మాట కూడా చెప్పలేద‌న్నారు. “పవన్‌ సినిమా డైలాగ్‌లు బట్టీ కొట్టారు. సినిమా వాళ్లు రాసిచ్చిన ‍స్క్రిప్ట్‌ను పవన్‌ చదివారు. నాడు అమరావతి.. ఒక కులానికే రాజధాని అని పవన్ అన‌లేదా? ” అని నాని ప్ర‌శ్నించారు. సీట్ల విష‌యంలో ప‌వ‌న్ గురించి జ‌గ‌న్ ఒక్క మాట కూడా అన‌లేద‌ని.. త‌మ వంటి కాపు నాయ‌కులు మాత్ర‌మే వ్యాఖ్యానించార‌ని పేర్ని చెప్పారు.

ప‌వ‌న్ త‌న‌కు న‌చ్చిన‌ట్టు సీట్లు తీసుకున్నా.. వైసీపీకి ఎలాంటి బాధా లేద‌న్నారు. “24 – 4 – 2 – 0” నువ్వు న‌చ్చిన‌ట్టు తీసుకో.. నీకు మిగిలేది చివ‌రికి సున్నానే.. అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ పవన్ ఉద్ధ‌రించింది ఏమీ లేద‌న్న నాని.. కేవ‌లం జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా రాజ‌కీయాలు చేసేందుకు మాత్ర‌మే ఒక పార్టీ పెట్టుకున్నాడ‌ని అన్నారు. “నీ చేష్టల వల్ల పవన్‌కు ఓటేద్దామనుకున్న కాపులు బాధపడతారు” అని వ్యాఖ్యానించారు.

సీఎం జగన్‌ గురించి టన్నుల టన్నుల సమాచారం ఉందంటున్న పవన్‌ ఎందుకు బయట పెట్టలేకపో తున్నారని విమ‌ర్శించారు. “పురాణాల్లో పవన్‌ను పోల్చాలంటే శల్యుడు, శిఖండి పాత్ర‌లే మిగిలి ఉన్నాయి. ఆయ‌న వామనుడు కాదు శల్యుడు, శిఖండి వంటి నాయ‌కుడు” అని వ్యాఖ్యానించారు. శ‌ల్య సార‌థ్యంలో మ‌హాభార‌తం ఎలా జ‌రిగిందో అంద‌రికీ తెలిసిందేన‌ని.. ఇప్పుడు ప‌వ‌న్ సార‌థ్యంలో జ‌న‌సేన ప‌రిస్థితి కూడా ఇలానే ఉంటుందని పేర్ని అన్నారు.