వైసిపి రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డికి బిగ్ రిలీఫ్ దొరికినట్లే. ఎంపి జోడు పదవులు నిర్వహిస్తున్న కారణంగా ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ టిడిపి నేత రామ కోటయ్య చేసిన ఫిర్యాదును ఎన్నికల కమీషన్ కొట్టేసింది. రాజ్యసభ ఎంపిగా ఉన్న విజయసాయిని ప్రభుత్వం ఢిల్లీలో ఏపి ప్రత్యేక ప్రతినిధిగా నియమించింది.
వెంటనే ఈ విషయమై తెలుగుదేశంపార్టీ తన అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఒకేసారి ఒకవ్యక్తి రెండు పదవుల్లో ఉండకూడదంటూ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అప్పట్లో నానా గోల చేశాడు. అంతేకాకుండా పార్టీ నేత సిహెచ్ రామకోటయ్య తరపున రాష్ట్రపతికి ఫిర్యాదు కూడా చేయించింది టిడిపి.
లాభదాయక పదవుల్లో ఉంటున్న విజయసాయిపై తక్షణమే అనర్హత వేటు వేయాల్సిందే అంటూ టిడిపి డిమాండ్ చేసింది. తెలుగుదేశంపార్టీ అభ్యంతరాలను పరిశీలించిన రాష్ట్రపతి ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల కమీషనర్ కు పంపారు. ఆఫీస్ ఆఫ్ ది ప్రాఫిట్ అనే విషయంలో నియమ, నిబంధనలను పరిశీలించిన ఎన్నికల కమీషన్ అధికారులు ఆఫీస్ ఆఫ్ ది ప్రాఫిట్ అనే నిబంధన ఎంపి విషయంలో వర్తించదంటూ స్పష్టంగా తేల్చారు.
ఎందుకంటే ఢిల్లీలో ఏపి ప్రత్యేక ప్రతినిధిగా నియమితుడైన విజయసాయికి జీత, బత్యాలేవీ అందటం లేదని ఎన్నికల కమీషన్ అధికారులు తేల్చేశారు. ఒకేసారి రెండు పదవుల్లోను కంటిన్యు అవుతున్న ఎంపి రెండు చోట్ల జీత బత్యాలు తీసుకుంటే మాత్రమే ఆఫీస్ ఆఫ్ ది ప్రాఫిట్ అనే అంశం వర్తిస్తుందనం చెప్పేశారు.
ఎన్నికల కమీషన్ ఉన్నతాధికారుల తాజా నిర్ణయం టిడిపికి మింగుడుపడనిదే. ఎలాగైనా విజయసాయి మీద అనర్హత వేటు వేయించాల్సిందే అంటూ యనమల తదితరులు చాలా పెద్ద ఎత్తున ప్రయత్నించారు. కానీ నిబంధనల ప్రకారం అనర్హత వేటు సాధ్యం కాదని తేల్చేయటంతో టిడిపి నేతలు ఒక్కసారిగా నీరు కారిపోయారు.
నిజానికి ఆఫీస్ ఆఫ్ ది ప్రాఫిట్ నియమ, నిబంధనలు యనమల లాంటి సీనియర్ నేతలకు తెలీదనుకునేందుకు లేదు. కాకపోతే ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని, కుదరకపోతే కోర్టులకు వెళ్ళి స్టేలు తీసుకురావాలన్న ఏకైక అజెండాతో ముందుకు పోతోంది.
తాజాగా ఎన్నికల కమీషన్ నిర్ణయంపైన టిడిపి ఇష్యూని వదిలేస్తుందా లేకపోతే ఇతర అంశాల్లాగే కోర్టులో కేసు వేస్తుందా అన్న అంశం ఆసక్తిగా తయారైంది. గడచిన 15 నెలలుగా ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలను టిడిపి నేరుగానో లేకపోతే ఎవరి ద్వారానో కోర్టులో కేసులు వేయిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. చూద్దాం ఈ విషయంలో ఎలా స్పందిస్తుందో.