ఏపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలన్న విషయంపై టీడీపీ-జనసేన మిత్రపక్షం చర్చలు కొలిక్కి వచ్చినట్టు తెలిసింది. ఆదివారం మధ్యాహ్నం.. సహా అర్థరాత్రి 11 గంటల వరకు కూడా ఈ చర్చలు రెండు దఫాలుగా జరిగాయి. మొత్తంగా అసెంబ్లీ స్థానాల్లో 30 స్థానాల నుంచి జనసేన పోటీ చేసే అవకాశం దక్కింది. అదేసమయంలో జిల్లాల ప్రాతిపదికన నియోజకవర్గాల వారీగా సీట్లను పంచుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు ఏకాభిప్రాయానికి వచ్చినట్టు పార్టీ వర్గాల సమాచారం.
అయితే.. 30 అనేది ప్రస్తుతానికి ఉన్న సంఖ్య అని.. ఎన్నికల సమయానికి అవసరమైతే.. మరో 5 నుంచి 10 స్థానాలు మార్పులు ఉంటాయని జనసేన నాయకులు చెబుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్.. దాదాపు 3 గంటల పాటు టికెట్ల అంశమే అజెండాగా చర్చించారు. సీట్ల సర్దుబాటుపై ఈ భేటీలో దాదాపు పూర్తి స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జనసేనకు ఎన్ని సీట్లు కేటాయించాలి.?, ఏయే నియోజకవర్గాలకు సంబంధించి ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయన్న సర్వేల ఆధారంగానే తుది కసరత్తులు పూర్తి చేశారు.
ఇక, రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని ఇప్పటికే పవన్ కల్యాణ్ ప్రకటించిన నేపథ్యంలో చంద్రబాబు వాటికి ఓకే చెప్పారు. జనసేన అభ్యర్థిగా మచిలీపట్నం నుంచి బాలశౌరి పోటీ చేయడం ఖాయమైంది. అదేసమయంలో తమవైపు నుంచి ఆశావహులు పెద్ద ఎత్తున ఉన్నారని.. మరిన్ని స్థానాలు కేటాయించాలని పవన్.. చంద్రబాబుకు చెప్పినట్లు సమాచారం. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో 50 శాతం షేర్ ఉండాలని ఆయన కోరినట్టు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. అదేవిధంగా ఉత్తరాంధ్రలోని విశాఖలోనూ పార్టీ బలంగా ఉందని, అక్కడ కూడా తమకు ఎక్కువ సీట్లు కావాలని పవన్ కోరినట్టు తెలిసింది.
ఇలా.. బుజ్జగింపు..
టికెట్ల కేటాయింపు.. పంపకాలు ఎలా ఉన్నా.. ఆయా సీట్లపై ఆశలు పెట్టుకున్నవారు హర్ట్ కాకుండా చూసేందుకు టీడీపీ, జనసేనలు ముందస్తు వ్యూహాలు రెడీ చేసుకున్నాయి. ఎక్కడా వివాదాలకు, కొట్లాటలకు తావివ్వకుండా.. జనసేన పోటీ చేసే స్థానాల్లో టీడీపీ ఆశావహులకు నచ్చజెప్పనున్నారు. ఆయా నేతల రాజకీయ భవిష్యత్తుకు పార్టీ హామీ ఇవ్వనుంది. అదేవిధంగా జనసేన ఆశావహులకు కూడా పవన్ ఇదే సూత్రాన్ని అమలు చేయనున్నారు. సీట్ల అంశంపై ఇరు పార్టీల నేతలకు సర్దిచెప్పి.. ఎలాంటి వివాదాలు రాకుండా.. వైసీపీకి ఛాన్స్ ఇవ్వకుండా చూసుకోవాలని ఇరు పార్టీల పెద్దలు నిర్ణయించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates