వీల్ ఛైర్లోనే ప్రచారమా ?

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను గెలుచుకోవాలన్నది కేసీయార్ టార్గెట్. అత్యధిక సీట్లను గెలుచుకోకపోతే భవిష్యత్తు రాజకీయాలు చాలా కష్టమైపోతాయని కేసీయార్ కు బాగా తెలుసు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ద్వారా పార్టీలో కుదుపులు మొదలైపోయాయి. ఏ ఎంఎల్ఏ ఏరోజు పార్టీని వదిలేసి కాంగ్రెస్ లో చేరుతారో తెలీని అయోమయం పెరిగిపోతోంది. ఇప్పటికి ఐదుగురు ఎంఎల్ఏలు రేవంత్ రెడ్డితో భేటీ అవ్వడం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

ఈ నేపధ్యంలోనే తొందరలోనే పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి. అందుకనే తనకు అందుబాటులో ఉన్న ప్రతి మార్గంలోను ఉధృతంగా ప్రచారం చేయాలని కేసీయార్ ఇప్పటికే డిసైడ్ అయ్యారు. అందులో ఒక మార్గం ఏమిటంటే వీల్ ఛైర్లోనే ప్రచారం చేయటం. దీనివల్ల తాను వ్యక్తిగతంగా ప్రచారం చేసినట్లుంటుంది అలాగే జనాల్లో సానుభూతిని సంపాదించినట్లు ఉంటుందని కేసీయార్ ఆలోచిస్తున్నారట. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిన రెండోరోజే బాత్ రూమ్ లో జారిపడటంతో కేసీయార్ తుంటి ఎముక విరిగిన విషయం తెలిసిందే.

ఆపరేషన్ చేసిన డాక్టర్లు కొన్ని వారాలు విశ్రాంతి అవసరమని చెప్పారు. ఇప్పుడిప్పుడే కేసీయార్ మెల్లిగా నడుస్తున్నా ఇంకా పూర్తిగా రికవర్ కాలేదు. మునుపటిలా నడవాలంటే మరికొన్ని వారాలు పూర్తిగా విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పారు. అప్పటివరకు వెయిట్ చేయాలంటే ఎన్నికల పుణ్యకాలం పూర్తయిపోతుంది. అందుకనే వీల్ ఛైర్లోనే ప్రచారం చేయాలని డిసైడ్ అయ్యారట. ఫిబ్రవరి 1వ తేదీన ఎంఎల్ఏగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. దానికి కూడా అసెంబ్లీకి వీల్ ఛైర్లోనే రాబోతున్నారు.

అదే పద్దతిలో పార్లమెంటు ఎన్నికల ప్రచారం కూడా చేయాలని డిసైడ్ అయ్యారట. గతంలో లాగ సుడిగాలి పర్యటనలు అని కాకుండా రోజుకు రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో ప్రచారం చేయబోతున్నట్లు పార్టీవర్గాల టాక్. ఇందులో భాగంగానే ఫాం హౌస్ లో ముఖ్యనేతలతో మంతనాలు జరుపుతు అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. తొందరలోనే కసరత్తు పూర్తిచేసి అభ్యర్ధులను ఫైనల్ చేయబోతున్నారు. ఇందులో సిట్టింగ్ ఎంపీల వివరాలను కూడా జాగ్రత్తగా చూస్తున్నారని సమాచారం. మరి కేసీయార్ వీల్ ఛైర్ ప్రచారం ఏమవుతుందో చూడాలి.