నెమ్మ‌దినెమ్మ‌దిగా అడుగులు వేస్తున్న కేసీఆర్‌

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కోలుకుంటున్నారు. నెమ్మ‌ది నెమ్మ‌దిగా అడుగులు వేస్తున్నారు. చేతిక‌ర్ర సాయంతో ఆయ‌న ఇంట్లోనే న‌డుస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను కేసీఆర్ కుటుంబ స‌భ్యులు మీడియాకు విడుద‌ల చేశారు. ఈ వీడియోలో మాజీ సీఎం కేసీఆర్‌.. చేతి క‌ర్ర సాయంతో, వైద్యుని సూచ‌న‌ల మేర‌కు కొన్ని అడుగుల దూరాన్ని న‌డుస్తున్న దృశ్యాలు ఉన్నాయి. కొన్నాళ్ల కింద‌ట కేసీఆర్‌కు తుంటి మార్పిడి ఆప‌రేష‌న్ జ‌రిగిన విష‌యం తెలిసిందే.

దీంతో ఆసుప‌త్రిలోనే రెండు వారాలకు పైగా రెస్ట్ తీసుకున్న కేసీఆర్‌.. త‌ర్వాత‌.. వీల్ చైర్‌లోనే ఇంటికి చేరుకున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఇంట‌కే ప‌రిమితమ‌య్యారు. పార్టీ కార్య‌క్ర‌మాల‌కు, నేత‌ల‌కు చాలా దూరంగా ఉంటున్నారు. అయితే.. పార్టీలో ఏం జ‌రుగుతోంద‌నే విష‌యాన్ని ఆయ‌న తెలుసుకుంటున్న‌ట్టు ఆయ‌న కుమారుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఇటీవ‌ల వెల్ల‌డించారు. ఇంత‌కుమించి.. ఇప్ప‌టి వ‌ర‌కు కేసీఆర్‌కు సంబంధించిన వివ‌రాలు.. బాహ్య ప్ర‌పంచానికి తెలియ‌లేదు.

మ‌రోవైపు.. కేసీఆర్ ఆరోగ్యం బాగాక్షీణించింద‌ని.. ఆయ‌న మంచానికే ప‌రిమితం అయ్యార‌ని.. ఇక‌, రాజ‌కీ యంగా ఆయ‌న కోలుకోలేర‌ని.. అతా ఆయ‌న కుమారుడే చూసుకుంటార‌ని.. ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో స‌మాచారం హ‌ల్చ‌ల్ చేసింది. అయితే.. దీనిపై బీఆర్ ఎస్ నాయ‌కులు కానీ, ఇత‌ర పార్టీ ముఖ్యులు కానీ.. స్పందించ‌లేదు. ఈ క్ర‌మంలో తాజాగా కేసీఆర్ న‌డుస్తున్న వీడియోను షేర్ చేయ‌డం ద్వారా.. ఆ గ్యాసిప్‌ల‌కు కేసీఆర్ ఫ్యామిలీ ఫుల్ స్టాప్ పెట్టిన‌ట్ట‌యింది.

ప్ర‌స్తుతం వైద్యులు చెబుతున్న దాని ప్ర‌కారం.. కేసీఆర్ పూర్తిస్థాయిలో కోలుకునేందుకు.. మ‌రో నెల రోజులు స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఇక‌, ఆయ‌న గ‌జ్వేల్ నుంచి మ‌రోసారి ఎమ్మెల్యేగా విజ‌యం ద‌క్కించుకున్న నేప‌థ్యంలో మూడు మాసాల‌లోగా ఎమ్మెల్యేగా ప్ర‌మాణం చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి ప్ర‌భుత్వం కూడా ఆయ‌న‌ను సంప్ర‌దించింది. దీనిపై త్వ‌ర‌లోనే కేసీఆర్ నిర్ణ‌యం తీసుకుంటార‌ని స‌మాచారం. ఇంటిలోనే ఉండి.. ప్ర‌మాణం చేయ‌డ‌మా.. లేక‌.. ప్ర‌త్యేక స‌దుపాయంతో అసెంబ్లీకి హాజ‌రు కావ‌డ‌మా? అనే విష‌యంపై దృష్టి సారించిన‌ట్టు తెలిసింది. మొత్తానికి కేసీఆర్‌.. కుటుంబం తాజాగా విడుద‌ల చేసిన వీడియో బీఆర్ ఎస్ నేత‌ల‌కు ఆనందం పంచుతోంది.