టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర కొన్ని సమస్యల కారణంగా.. వాయిదా పడి.. మళ్లీ గత నెల 27 నుంచి తిరిగి కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో కొనసాగుతోంది. అయితే..ఈ యాత్ర షెడ్యూల్ ప్రకారం ఇచ్చాపురంలో పూర్తికావాలి. సుమారు 4 వేలకిలోమీటర్ల లక్ష్యం సాధించాలి. ఇదే విషయాన్ని యాత్ర ప్రారంభంలో చెప్పుకొచ్చారు. దీని ప్రకారమే యాత్ర కూడా వడివడిగా ముందుకు సాగింది.
అయితే.. అనూహ్యంగా ఇప్పుడు యాత్రలో మార్పులు చోటు చేసుకున్నాయి. కనీసం జనవరి తొలి వారం వరకు జరగాల్సి ఉన్న యాత్రను ఈ నెల 17నే ముగించేయాలని నిర్నయించారు. అది కూడా.. శ్రీకాకుళం జిల్లా వరకు కూడా కాకుండా.. విశాఖపట్నం జిల్లాలోనే యాత్రను ముగించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించేసింది. ఈ నెల 17 నాటికి యువగళం పాదయాత్ర.. భీమిలికి చేరుకుంటుంది. ఈ నియోజకవర్గంలో యాత్రను ఆపేయాలని నిర్ణయించారు.
యాత్ర ముగింపు సమయంలో భారీ ఎత్తున సభ నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఈ క్రమంలో పార్టీ నాయకులు ఆ ఏర్పాట్లలో తలమునకలయ్యారు. ఇదిలావుంటే.. అసలు పాదయాత్రను ఎందుకు ముందుగానే పూర్తి చేయాలని భావిస్తున్నారు? అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? అనేది ఆసక్తిగా మారింది. ఈ విషయాలను గమనిస్తే.. రెండు కీలక విషయాల నేపథ్యంలోనే యువగళం పాదయాత్రకు బ్రేక్ ఇచ్చిన ట్టు తెలుస్తోంది.
ఒకటి.. ఎన్నికలకు సమయం లేకపోవడంతోపాటు.. టీడీపీ-జనసేన కలిసి ఉమ్మడిగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఉమ్మడి కార్యాచరణను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సి ఉంది. ఇది అత్యంత కీలకం. ఇక, రెండో కారణం.. నియోజకవర్గాల స్థాయిలో పార్టీ నేతలను సర్దు బాటు చేయాల్సి ఉండడంతో పాటు అసంతృప్తులను బుజ్జగించాల్సిన గురతర బాధ్యత ఈ దఫా నారా లోకేష్‌పైనే ఉందని అంటున్నారు. ఇక, ఎన్నికలకు ముందునుంచే నియోజకవర్గాల స్థాయిలో ప్రచారం చేయడం. ఈ మూడు కారణాల నేపథ్యంలోనే యువగళం పాదయాత్రను ముందుగానే ముగించేస్తున్నారని అంటున్నారు. ఇదీ.. సంగతి!!