తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఈ క్రమంలోనే ప్రతిపక్ష నేతలపై మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో గెలుపు తమదేనని, డిసెంబర్ 3న ఫలితాలు తమకే అనుకూలంగా ఉంటాయని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కొడంగల్ లో రేవంత్ రెడ్డిని గత ఎన్నికల్లో ఓడించామని, ఈసారి కూడా ఓడిస్తామని కేటీఆర్ అన్నారు.
గజ్వేల్ లో కేసీఆర్ పై పోటీ చేయడం అంటే పోచమ్మ గుడి ముందు పొట్టేలును కట్టినట్టేనని, ఎవరైనా ఎగురుతామనుకుంటే వారి కర్మ అని అన్నారు. కామారెడ్డిలో బిల్డప్ కోసమే రేవంత్ పోటీ చేస్తున్నారని, అక్కడ తాను గెలవనని ఇండియా టుడే కాన్ క్లేవ్ లో స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. కొడంగల్ లో చెల్లని రూపాయి కామారెడ్డిలో చెల్లుతుందా అని కేటీఆర్ ప్రశ్నించారు.
ఇక, గోషామహల్ లో రాజాసింగ్, హుజురాబాద్ లో ఈటల రాజేందర్ ఓటమి కూడా తప్పదని జోస్యం చెప్పారు. ఈ మూడు విషయాలు రాసుకోవాలని మీడియా ప్రతినిధులతో కేటీఆర్ అన్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మోడీ కాదు ఢిల్లీ నుంచి ఎవరొచ్చినా బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కదని, గత ఎన్నికల్లో కూడా గోషామహల్ ఒక్కటే బీజేపీ గెలిచిందని కేటీఆర్ అన్నారు.
ఇక, ఏపీ రాజకీయాలపై కూడా కేటీఆర్ స్పందించారు. ప్రచార రథం మీద నుంచి పడిన ఘటన తర్వాత తనకు నారా లోకేష్ ఫోన్ చేసి పరామర్శించారని, తనకు లోకేష్ తమ్ముడు వంటి వారని కేటీఆర్ అన్నారు. ఇక, పవన్ కళ్యాణ్ తనకు అన్నయ్య వంటి వారని, ఎవరితోనూ తనకు వైరుధ్యం లేదని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
చంద్రబాబుపై కేసీఆర్ కు, తనకు ఎలాంటి కోపం లేదని, చంద్రబాబు ఆరోగ్యం గురించి తాను లోకేష్ ను వాకబు చేశానని చెప్పారు. చంద్రబాబుపై కక్ష సాధించే ఆలోచన కేసీఆర్ కు లేదని చెప్పారు. గతంలో చంద్రబాబు పిలిచిన వెంటనే అమరావతికి కేసీఆర్ వెళ్లారని గుర్తు చేశారు. రోజు తనను బూతులు తిట్టే రేవంత్ రెడ్డిని కేసీఆర్ ఏమీ అనడం లేదని, అన్ని రాష్ట్రాలు బాగుండాలని తాము కోరుకుంటున్నామని అన్నారు.