ఇండియా… కాదు, ఇక ‘భార‌త్‌’

ప్ర‌పంచ స్థాయిలో మ‌న దేశం గురించి ఎవ‌రైనా మాట్లాడాల్సి వ‌చ్చినా.. అధికారిక స‌మాచారం పంచుకోవాల్సి వ‌చ్చినా.. ఇప్ప‌టి వ‌ర‌కు ‘ఇండియా’ అనే సంబోధించేవారు. ఉదాహ‌ర‌ణ‌కు ‘ప్రైమినిస్ట‌ర్ ఆఫ్ ఇండియా’ అని, ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ అనే ఇప్ప‌టి వ‌ర‌కు సంబోధించ‌డం మ‌న‌కు తెలుసు. ఇదే సంప్రదాయంగా కూడా వ‌స్తోంది. అయితే, ఇటీవ‌ల కాలంలో అన్నింటికీ ‘భారతీయ‌త‌’ను జోడిస్తున్న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ స‌ర్కారు … ఇప్పుడు ఇండియా పేరును కూడా ప్ర‌పంచ స్థాయిలో మార్చేసింది!

ఔను. ఇది నిజ్జంగానే నిజం. ప్ర‌స్తుతం మ‌న దేశం జీ-20 దేశాల స‌ద‌స్సుల‌కు ఆతిథ్యం ఇస్తోంది. ఈ క్ర‌మంలో ఆయా జీ-20 దేశాల ప్ర‌తినిధుల‌కు ఈ నెల 9వ తేదీన రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ప్ర‌త్యేక విందును ఏర్పాటు చేశారు. అయితే.. దీనికి సంబంధించి రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ పంపించిన ఆహ్వాన ప‌త్రిక‌ల‌పై ఇండియా బ‌దులు ‘భార‌త్‌’ అని పేర్కొన‌డం సంచ‌ల‌నంగా మారింది. గ‌తంలోనే కాదు.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడా ఇలా ఎవ‌రూ అధికారిక ప‌త్రాల‌పైనా.. ఆహ్వాన ప‌త్రిక‌లపైనా ఇండియా స్థానంలో భార‌త్ అని పేర్కొన‌లేదు.

కానీ, తాజాగా రాష్ట్రపతి భవన్‌ మన దేశం పేరును ‘భారత్’ అని పేర్కొనడం వివాదానికి దారి తీసింది. ఈ నెల 9న రాష్ట్రపతి భవన్‌లో విందు ఇస్తున్నారని, ఈ విందుకు హాజరుకావాలని కోరుతూ జీ-20 దేశాల‌ అతిథులకు పంపిన ఆహ్వాన పత్రికల్లో మన దేశం పేరును ఇండియా అని కాకుండా భారత్ అని పేర్కొన‌డంపై అన్ని వ‌ర్గాల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. సాధారణంగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ అని పేర్కొంటారని, ఈ ఆహ్వాన పత్రికల్లో ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని రాయ‌డం వివాదానికి దారి తీసింది. దీనిపై ఇప్ప‌టికే కాంగ్రెస్ నిప్పులు చెరుగుతుండ‌గా.. దీనికి మ‌రిన్ని పార్టీలు మ‌ద్ద‌తు ప‌లికాయి.