ఔను.. ఇప్పుడు ఈ మాటే రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. రాష్ట్రంలో రెండు రోజుల కిందట చోటు చేసుకున్న పరిణామాలను గమనించిన వారు.. ఇదే మాట అంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠం ఎక్కుతానని కొంత సేపు చెబుతున్నారు. తర్వాత.. తాను ఎమ్మెల్యే అయితే.. చాలనే భావనలో మాట్లాడుతున్నారు. సరే.. ఏదేమైనా.. 2019 ఎన్నికలను తీసుకుంటే.. ఆయన ఎంత దూకుడుగా ఉన్నా.. ఫలితం కనిపించలేదు.
వచ్చే ఎన్నికల్లో కనిపిస్తుందనే ఆశ జనసేనలో ఆశలు ఉండొచ్చు. కానీ.. రాజకీయాల్లో ఉన్నవారికి అంది వచ్చిన ప్రతి అవకాశం కూడా.. స్వర్ణమయమే. పైగా ఎన్నికల సమయం కావడంతో ఎవరు ఎటు నుంచి తమకు అందివచ్చినా వినియోగించుకోవాలనే రాజకీయాల్లో ఉన్నవారు చేసే పనే. అయితే.. జనసేన విషయాన్ని తీసుకుంటే.. ఈ తరహా పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు దన్నుగా మెగా స్టార్ చిరంజీవి .. వాల్తేరు వీరయ్యఫంక్షన్‌లో మాట్లాడారు. పైకి ఆయన జనసేన పేరు.. పార్టీ గురించి ప్రస్తావించకపోయినా.. ఏపీ సర్కారును ఇరుకున పడేలా వ్యాఖ్యలు చేశారు. ఆ వెంటనే వైసీపీ నాయకులు, మంత్రులు చిరును టార్గెట్ చేశారు. అంతేకాదు.. ఇదేసమయంలో చిరంజీవి తాజా సినిమా బోళా శంకర్ సినిమాకు సంబంధించిన టికెట్ల ధరలు, అదనపు షోల విషయంలో ఏపీ సర్కారు మడత పేచీ పెట్టింది.
ఈ రెండు విషయాలను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు జనసేన అధినేత ఎక్కడా ప్రయత్నం చేయలేదనే టాక్ వినిపిస్తోంది. చిరంజీవినివైసీపీ నాయకులు, మంత్రులు ఏకేసినా.. పన్నెత్తు మాట ఆయన అనలేదు. విశాఖలో వారాహి యాత్ర 3.0 చేసినా.. ఆయన ఎక్కడా చిరంజీవి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించలేదు. పోనీ.. మంత్రులు చిరుపై చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన తిప్పికొట్టేలేదు. ఇవన్నీ పక్కన పెడితే.. బోళా శంకర్ విషయంలో సర్కారు వ్యవహరించిన తీరును కూడా ఆయన ప్రస్తావించలేదు.
అంటే.. పవన్ కళ్యాణ్‌కు మెగా సెంటిమెంటు, మెగా సపోర్టు అవసరం లేదా? అనేది చర్చకు దారితీస్తోంది. ఎన్నికల సమయంలో అత్యంత కీలకమైన ఈ సపోర్టును ఆయన అందిపుచ్చుకుంటే.. ఎంతో కొంత మేలు జరుగుతుందని జనసేన అభిమానులు భావిస్తున్నా.. పవన్ మాత్రం ఆ జోలికి పోకపోవడం గమనార్హం.