ఏపీలోని వైసీపీ ప్రభుత్వం పై విరుచుకుపడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తాజాగా మరోసారి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. వారాహి 2.0 యాత్ర చేపట్టిన ఆయన తాజాగా ఏలూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు.. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలకు లింకు పెడుతూ.. ఫొటోలు, ఆధారాలతో సహా విమర్శలు గుప్పించారు. ఇప్పటికే పలు విషయాలపై పవన్ విమర్శల బాణాలు సంధిస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఏలూరు జిల్లా కేంద్రం ఏలూరులోని ప్రభుత్వ కాలేజీ దుస్థితిని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. తమ ప్రభుత్వ హయాంలో పాఠశాలలు, కాలేజీలను ఎంతో అభివృద్ధి చేస్తున్నామని.. విద్యారంగంలో రాష్ట్రాన్ని ఎక్కడికోతీసుకువెళ్తున్నామని చెప్పుకొనే సీఎం జగన్.. ఏలూరు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల దుస్థితిని ఒక్కసారి పరిశీలించాలని చురకలంటించారు. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
“చెట్ల కింద చదువులు చూడాలంటే ఎక్కడో మారుమూల పల్లెలకు వెళ్ళనవసరం లేదు. జిల్లా కేంద్రం ఏలూరు నగరంలో ఉన్న ప్రభుత్వ కళాశాలకు వెళ్తే చాలు. పథకాలకు పేర్లు పెట్టుకోవడం మీద ఉన్న శ్రధ్ధ కాలేజీకి భవనం నిర్మించడంపై పెట్టాలి. 300మంది చదువుతున్న ఈ కాలేజీకి బటన్ నొక్కి బిల్డింగ్ కట్టించు జగన్“ అని పవన్ వ్యాఖ్యానించారు. పథకాలకు పేర్లు పెట్టుకుంటున్నారని.. ప్రచారం చేస్తున్నారని.. కానీ, క్షేత్రస్తాయిలో ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారని పవన్ వ్యాఖ్యానించారు. మరి దీనిపై వైసీపీ నాయకులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates