ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తున్నాయని, జగన్ తన సర్కారును రద్దు చేసుకునేందుకు ఉత్సాహంగా ముందుకు వెళ్తున్నార ని.. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. జగన్ ఢిల్లీ పర్యటనలో(పార్లమెంటు ప్రారంభోత్సవాన్ని పురస్క రించుకుని) ఉన్న సమయంలోనే ఈ వార్తలు హల్చల్ చేశాయి. అయితే.. తాజాగా ముందస్తు ఎన్నికలపై సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ ఊహాగానాలకు తెరదించారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదని జగన్ తేల్చిచెప్పేశారు. ఈ మేరకు కేబినెట్ సమావేశంలో మంత్రులకు స్పష్టంగా తెలియజేశారు.
షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని సీఎం జగన్ చెప్పారు. మరో 9 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయని మంత్రులకు జగన్ క్లారిటీ ఇచ్చేశారు. ఈ 9 నెలలు బాగా కష్టపడాలని మంత్రులకు ఈ సందర్భంగా సీఎం సూచించారు. ఇప్పుడు కష్టపడితే మళ్లీ గెలుపు మనదేనని ఆశాభావం వ్యక్తం చేశారు. పనిలో పనిగా ఇటీవల రాజమండ్రి మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టో అంశాన్ని కూడా ముఖ్యమంత్రి జగన్ గుర్తుచేశారు. చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోను పట్టించుకోవాల్సిన అవసరం లేదని జగన్ తేల్చిచెప్పారు.
“అవన్నీమనల్ని, పొరుగు రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాలను చూసి కాపీ పేస్ట్ చేసిన హామీలు. వీటిని ప్రజలునమ్మరు. అసలు చంద్రబాబుకు విశ్వసనీయత లేదు. ఆయన మ్యానిఫెస్టోకు కూడా విశ్వసనీయత ఉండదు. కాబట్టి మీరేమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన మ్యానిఫెస్టోను సంపూర్ణంగా అమలు చేస్తున్నాం. అన్ని వర్గాలప్రజలు కూడా ఆనందంగా ఉన్నారు. దీనినే ప్రజల్లోకి తీసుకువెళ్లండి“ అని సీఎం జగన్ మంత్రి వర్గానికి దిశానిర్దేశం చేశారు.
ఇదిలావుంటే, ఇటీవల ముందస్తు ఎన్నికలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా మాట్లాడారు. ముందస్తుకు వెళ్లే ఆలోచన లేదని చెప్పారు. దీనిపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ ఎద్దేవా చేసింది. ముందస్తుకు వెళ్తే ఓడిపోతామన్న భయంతో వైసీపీ వణికిపోతుందని ఆ పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య విమర్శించారు. వైనాట్ 175 సీట్లు గెలుస్తామన్న జగన్ డాంబికాలు ఏమయ్యాయని వర్ల రామయ్య నిలదీశారు. తాజాగా ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై టీడీపీ ఎలా రియాక్ట అవుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates