రాహుల్‌కు మోడీ భ‌య‌ప‌డుతున్నారా?

కాంగ్రెస్ అగ్ర‌నేత‌.. రాహుల్ వ్య‌వ‌హారం.. అనేక కీల‌క మ‌లుపులు తిరిగేలా క‌నిపిస్తోంది. ఆయ‌న‌కు స్థానిక‌కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించ‌డం నుంచి ఆయ‌న‌ను పార్ల‌మెంటుకు అన‌ర్హుడిగా ప్ర‌క‌టించ‌డం వర‌కు.. అనేక అంశాల‌పై చ‌ర్చోప‌చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

అయితే.. ఈ మొత్తం వ్య‌వ‌హారాన్ని.. గ‌మ‌నిస్తే.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. రాహుల్ కు భ‌య‌ప‌డుతున్నారా? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. కానీ, ఆయ‌న రాహుల్‌కు భ‌య‌ప‌డ‌డంలేదు. కేవ‌లం రాహుల్ ద‌గ్గ‌ర ఉన్న కీల‌క ఆధారాలు.. స‌మాచారానికే భ‌య‌ప‌డుతున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ప్ర‌స్తుత పార్ల‌మెంటు బ‌డ్జెట్ స‌మావేశాల్లో ఇరు స‌భ‌లు కూడా ఒక్క గంట కూడా చ‌ర్చ లేకుండానే ముగుస్తున్నాయి. అధికార ప‌క్షం(బీజేపీ స‌హా మిత్ర‌ప‌క్షాలు), ప్ర‌తిప‌క్షం(కాంగ్రెస్ స‌హా మిత్ర‌ప‌క్షాలు) తీవ్ర ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు నినాదాల‌తో అట్టుడుకిస్తు న్నాయి. ఈ విష‌యాన్ని గ‌మ‌నిస్తే.. ప్ర‌భుత్వ వ్యూహం స్ప‌ష్టంగా తెలుస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎక్క‌డో లండ‌న్‌లో రాహుల్ గాంధీ భార‌త్ ప‌రువు తీశార‌ని.. ఆయ‌న క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని కొన్ని రోజులు.. కాదు.. అస‌లు ఆయ‌న‌ను స‌భ‌కే రాకుండా చేయాల‌ని కొన్ని రోజులు బీజేపీ స‌భ్యులు.. మంత్రులు డిమాండ్ చేస్తున్నారు.

మ‌రోవైపు.. అదానీ-హిండెన్‌బ‌ర్గ్‌(అమెరికా సంస్థ‌) వివాదంపై చ‌ర్చించాల‌ని.. దీనిపై విచార‌ణ‌కు జేపీసీ(సంయుక్త పార్ల‌మెంట‌రీ సంఘం) వేయాల‌ని కాంగ్రెస్ స‌హా ప్ర‌తిప‌క్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో స‌భ వాయిదాల ప‌ర్వంగా సాగుతోంది. అయితే.. నిజానికి కాంగ్రెస్ ప‌ట్టుబడుతున్న జేపీసీ వేసేది లేద‌ని ప్ర‌భుత్వం అంటోంది. కానీ, ఇక్క‌డే కీల‌క విష‌యం ఉంది. త‌న ద‌గ్గ‌ర ఆధారాలు ఉన్నాయ‌ని.. అదానీకి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి మ‌ధ్య బినామీ వ్య‌వ‌హారాలు సాగాయ‌ని.. దీనికి సంబంధించి పూర్తి విష‌యాల‌ను తాను వెల్ల‌డిస్తాన‌ని రాహుల్ ఇప్ప‌టికే స్పీక‌ర్‌కు లేఖ రాశారు.

తాజాగా ఈ విష‌యాన్ని రాహుల్ బ‌హిర్గ‌తం చేశారు. దీనికే ఇప్పుడు మోడీ భ‌య‌ప‌డుతున్నార‌నేది విశ్లేష‌కుల మాట‌. ఎందుకంటే.. పార్ల‌మెంటుకు ఇచ్చిన ఆధారాల్లో వాస్త‌వం లేక‌పోతే.. స‌భ్యుడిపై చ‌ర్య‌లు తీసుకునేందుకు లోక్‌స‌భ స్పీక‌ర్‌కు పూర్తి స్వేచ్ఛ ఉంది. దీని ఆధారంగా కూడా.. స‌భ్యుడి పై అన‌ర్హ‌త వేటు వేయొచ్చు(ప్ర‌జాప్రాతినిధ్య చ‌ట్టంలో నే ఉంది) సో.. దీనిని బ‌ట్టి.. రాహుల్ ఇచ్చిన లేఖ‌ల్లో వాస్తవాలు ఉండి ఉండాలి. ఇక‌, పోతే.. వాటిపై చ‌ర్చ వ‌స్తే.. మోడీ అడ్డంగా దొరికిపోయే అవ‌కాశం ఉంది. అందుకే.. ఈ అంశాల‌పై అస‌లు చ‌ర్చేలేకుండా చేయాల‌నే వ్యూహంతో .. లండ‌న్ వ్యాఖ్య‌లను తెర‌మీదికి తెచ్చార‌నేది కీల‌క విశ్లేష‌ణ‌. ఏదేమైనా.. అధికార పార్టీ వ్యూహం ముందు కాంగ్రెస్‌, దాని మిత్ర‌ప‌క్షాలు ఏమేర‌కు నిల‌బ‌డతాయో చూడాలి.