ఉద్యోగ సంఘాల టైమింగ్ అదుర్స్

తొందరలో జరగబోతున్న ఎంఎల్సీ ఎన్నికలపై ఉద్యోగుల దెబ్బ తప్పదా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఈనెల 13వ తేదీన ఐదు ఎంఎల్సీ స్ధానాలకు ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. సరిగ్గా అదును చూసుకుని తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఉద్యోగసంఘాల నేతలు ఆందోళనలకు పిలుపిచ్చారు. ఈ ఆందోళనలు 9వ తేదీ నుంచి మొదలవ్వబోతున్నాయి. నేపధ్యంలోనే ఎంఎల్సీ ఎన్నికలపై ఉద్యోగుల ఆందోళన ప్రభావం ఎంతుంటుందనే విషయమై ఉత్కంఠ పెరిగిపోతోంది.

మూడు గ్రాడ్యుయేట్, రెండు టీచర్ల నియోజకవర్గాల ఎంఎల్సీలకు ఎన్నిక జరగబోతోంది. ఈ ఐదు స్ధానాలకు జరగబోయే ఎన్నికలు దాదాపు అన్ని జిల్లాలు కవర్ అవబోతున్నాయి. ఈ ఎన్నికలకు మామూలు పబ్లిక్ తో సంబంధంలేదు. ఇందులో ఓటర్లు గ్రాడ్యుయేట్లు, నిరుద్యోగులు, ఉద్యోగులు, టీచర్లు మాత్రమే. ఇప్పటికే టీచర్లు, ఉద్యోగులు ప్రభుత్వంపై బాగా మండిపోతున్నానే ప్రచారం తెలిసిందే. ఉద్యోగుల ఆర్ధికపరమైన డిమాండ్లను పరిష్కరించటంలో ప్రభుత్వం ఫెయిలైందని ఉద్యోగ సంఘాల నేతలు తీవ్రంగా మండిపోతున్నారు.

ఇదే సమయంలో ఫేషియల్ రికగ్నిషన్, థంబ్ ఇంప్రెషన్ లాంటి అటెండెన్స్ విధానంతో టీచర్లు కోపంతో ఉన్నారు. ఇలాంటి అనేక పాయింట్ల మీద ఉద్యోగులు, టీచర్లు ఇప్పటికే సమ్మె చేసిన విషయం తెలిసిందే. ఇపుడు కూడా అవే డిమాండ్లతో ఆందోళనలకు పిలుపిచ్చారు. అసలే మంటమీదున్న ఉద్యోగులు, టీచర్లు ఆందోళనల పేరుతో ఎంఎల్సీ ఎన్నికల్లో అధికారపార్టీ అభ్యర్ధులకు వ్యతిరేకంగా ఓట్లేసే అవకాశాలున్నాయి.

అందుకే ఈ విషయాలను ప్రభుత్వం జాగ్రత్తగా పరిశీలిస్తోంది. ఇందులో భాగంగానే ఉద్యోగసంఘాల నేతలతో సమావేశమయ్యేందుకు మంత్రుల కమిటీ రెడీ అయ్యింది. సమస్యల పరిష్కారం కావాలి కానీ సమావేశాలు ఎందుకని నేతలంటున్నారు. మరీ నేపథ్యంలో ఈరోజు సమావేశంలో ఏమి తేలుతుందో చూడాలి. ఏదేమైనా స్థానిక సంస్థల కోటాలో భర్తీ అయ్యే తొమ్మిది ఎంఎల్సీ స్ధానాలను ఖాతాలో వేసుకున్నంత తేలిక్కాదు ఐదు స్ధానాల ఎంఎల్సీ ఎన్నికలని ఇప్పటికే వైసీపీకి అర్ధమయ్యుండాలి. మరి దీనికి విరుగుడుగా, అన్నింటినీ గెలుచుకునేందుకు అధికార పార్టీ ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తుందన్నది ఆసక్తిగా మారింది. ఉద్యోగ సంఘాల నేతల సమావేశ ఫలితం ఎలాగుంటుందో చూడాల్సిందే.