ఓటర్లకు ధర్మాన వార్నింగ్

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వైసీపీలో ధర్మాన సోదరుడు పెద్ద రౌడీ బ్యాచ్ గా తయారయ్యారు. నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ప్రత్యర్థి పార్టీ నేతలను, ఓటర్లను భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ధర్మాన కృష్ణదాస్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన బూతు పంచాంగం మొదలెట్టేవారు. పిచ్చిపిచ్చిగా తిట్టేవారు.. సీఎం జగన్ అంటే పరమ భక్తిని ప్రదర్శించేవారు. జిల్లా వైసీపీలో తమ కుటుంబం మాత్రమే ఉందన్నట్లుగా ప్రవర్తించేవారు.

మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో కృష్ణదాస్ ను తొలగించి ప్రసాదరావుకు అవకాశం ఇచ్చారు. ఆయన కూడా సోదరుడి తీరులోనే పోతున్నారు. మరీ ఓవర్ గా కాకపోయిన అప్పుడప్పుడు తిట్ల దండకం అందుకుంటుంటారు. విశాఖ రాజధాని నినాదాన్ని ప్రజలు అంగీకరించకపోతే అనర్ధాలు ఖాయమని హెచ్చరిస్తుంటారు. విశాఖ రాజధానిగా అంగీకరించకపోతే ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని కూడా ఆయన కొత్త వాదనను తెరపైకి తెచ్చారు..

ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మళ్లీ వార్నింగులు మొదలు పెట్టారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్లకు ప్రసాధరావు వార్నింగ్ ఇచ్చారు. పార్టీ నిర్ణయించిన అభ్యర్ధులకు ఓటు వేయకపోతే పోలింగ్ జరిగిన మరుసటి క్షణమే వైసీపీ నుంచి సస్పెండ్ చేస్తామని ఓటర్లను హెచ్చరించారు. తమ వద్ద బలమైన వాలంటీర్ వ్వవస్ధ ఉందని ఎవరు ఎవరికి ఓటు వేస్తున్నారో ప్రతి కుటుంబ సమాచారం తమకు తెలిసిపోతుందని అన్నారు.

శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన వైసీపీ విస్తృత స్ధాయి సమావేశంలో మంత్రి ధర్మాన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతే విశాఖ రాజధానికి వ్యతిరేకంగా ప్రజల నిర్ణయం ఉందన్న తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందంటూ స్థానిక సంస్థల ఓటర్లను భయపెడుతున్నారు.

సామాజిక వర్గం రాజకీయాలను కూడా ధర్మాన తెరపైకి తెచ్చారు. వైసీపీ ప్రభుత్వం కాపులను నిర్లక్ష్యం చేస్తోందన్న భావన సరికాదని అన్నారు. శ్రీకాకుళం జిల్లా స్ధానిక సంస్ధల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాపు ఓటర్లు ఎవరూ అపోహలకు గురికావద్దని సూచించారు. కాపులంతా వైసీపీకి ఓటెయ్యాలన్నట్లుగా ధర్మాన మాట్లాడుతుంటే మరి జగన్ స్పందన ఏమిటో చూడాలి..