సిసోడియా చెప్పందే నిజమైందా… !

ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణ మరింత వేగవంతమైంది. ఈడీ, సీబీఐ వరుస అరెస్టుకు కొనసాగితున్నాయి. ఇప్పటి వరకు డజను మందిని రెండు దర్యాప్తు సంస్థలు అరెస్టు చేశాయి. అందులో శరత్ చంద్రారెడ్డి, బుచ్చిబాబు, మాగుంట రాఘవరెడ్డి లాంటి హై ప్రొఫెల్ వ్యక్తులున్నారు. తాజాగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆదివారం అరెస్టయ్యారు. సీబీఐ కార్యాలయానికి పిలిపించి ఎనిమిది గంటల పాటు ప్రశ్నించిన తర్వాత ఆయన అరెస్టును ప్రకటించారు.

మోదీ చెప్పారట

కొన్ని రోజుల క్రితం ఢిల్లీ అసెంబ్లీలో సిసోడియా ఒక స్టేట్ మెంట్ ఇచ్చారు. అప్పటికే సీబీఐ ఆయన్ను ఒక సారి ప్రశ్నించింది. తనను ఎప్పుడు అరెస్టు చేస్తున్నారని సీబీఐ అధికారులను సిసోడియా ప్రశ్నించారట. అందుకు వారు నింపాదిగా సమాధానం ఇచ్చారట. నిజానికి అరెస్టు చేయాల్సిన అవసరం లేదు కానీ మిమ్మల్ని రెండు వారాలైనా జైలులో ఉంచాలని మోదీ చెప్పారని సీబీఐ అధికారులు వెల్లడించారట. అందుకే అరెస్టు చేసేందుకు వచ్చే అధికారుల కోసం తాను నిరీక్షిస్తున్నానని సిసోడియా చెప్పుకున్నారు. పైగా జైలుకెళ్లేందుకు సిద్ధమేనని, తాము ఎలాంటి తప్పు చేయలేదని సిసోడియా అన్నారు. కేజ్రీవాల్ శిష్యుడినైన తాను ఎవరికీ భయపడబోనని ఢిల్లీ డిప్యూటీ సీఎం కుండ బద్దలు కొట్టారు…

ఏడెనిమిది నెలలు జైల్‌లో ఉంచినా…

సిసోడియా ఆదివారం సీబీఐ కార్యాలయానికి వెళ్లే ముందు రోడ్ షో నిర్వహించారు. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. తనను ఏడెనిమిది నెలలు జైల్లో ఉంచినా భయపడబోనని, గర్వంగా భావిస్తానని ప్రకటించారు. ఆప్ కార్యకర్తలు ధైర్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అవి తప్పుడు కేసులని ప్రచారం చేయాలన్నారు. తన భార్యకు ఆరోగ్యం బాగోలేదని, ఎవరైనా ఆమెకు సాయం చేస్తే సంతోషిస్తానన్నారు. ఢిల్లీ పిల్లలంతా బాగా చదువుకోవాలని ఆకాంక్షించారు.

తనను ఏడెనిమిది నెలలు జైల్‌లో ఉంచబోతున్నారని సిసోడియా నర్మగర్భంగా చెప్పారు. సీబీఐ కూడా ఈ దిశగా సంకేతాలిచ్చింది. మరి అది రెండు వారాలా లేక ఎనిమిది నెలలా అన్న సంగతి తెలియాల్సి ఉంది.. సీబీఐ కోర్టులో ప్రవేశపెట్టే సాక్ష్యాధారాలను బట్టి ఉంటుంది…