సాయిరెడ్డిని పక్కన పెట్టేశారు.. ఇదిగో రుజువు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతల్లో ఒకరైన విజయసాయిరెడ్డిలో కొత్త మనిషి కనిపిస్తున్నాడు అందరికీ. తన రాజకీయ ప్రత్యర్థులపై ఆన్ లైన్లో, ఆఫ్ లైన్లో ఆయన ఎలా విరుచుకుపడుతుంటారో.. ఎంతటి దారుణమైన భాష వాడుతుంటారో తెలిసిందే. కానీ కొంత కాలంగా ఆయన ట్విట్టర్ అకౌంట్ గమనిస్తే పరుషమైన విమర్శ ఒక్కటీ లేదు. అదే సమయంలో వైకాపాలో ఆయన ప్రాధాన్యం అంతకంతకూ తగ్గిపోతూ వస్తోంది. అందులోనూ ఇటీవల తారకరత్న అనారోగ్యం పాలైనపుడు.. తర్వాత అతను మరణించినపుడు తనకు దగ్గరి బంధువైన సాయిరెడ్డి వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది.

ఓవైపు తారకరత్న విషయంలో వైకాపా వాళ్లంతా దారుణమైన దుష్ప్రచారాలు చేస్తుంటే.. సాయిరెడ్డి మాత్రం బాలయ్యను పొగిడారు. తారకరత్న మరణించిన సమయంలో చంద్రబాబుతో ఎంతో సన్నిహితంగా మెలిగారు. ఈ పరిణామాలు వైకాపా అధినేత, సీఎం జగన్‌కు ఏమాత్రం రుచించేవి కావని.. సాయిరెడ్డికి పంచ్ పడటం ఖాయమని అనుకున్నారు చాలామంది.
ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది. ఇప్పటికే పార్టీలో సాయిరెడ్డికి ప్రాధాన్యం బాగా తగ్గిపోగా.. ఇప్పుడు ఆయన్ని దాదాపుగా జీరోను చేసేశారు.

వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నెట్‌వర్క్‌ను అట్టడుగు స్థాయిలో బలోపేతం చేసేందుకు వైకాపా నాయకత్వం జిల్లా స్థాయిలో పార్టీ అనుబంధ సంస్థలను తాజాగా ప్రకటించింది.అందులో వివిధ విభాగాలకు అధ్యక్షులను ప్రకటించింది. దీని సంబంధించి మీడియాకు విడుదల చేసేన ప్రకటనలో ఈ అనుబంధ విభాగాల రాష్ట్ర సమన్వయ కర్తగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని పేర్కొనడం గమనార్హం.

ఇంతకుముందు ఇదే పదవిలో విజయసాయిరెడ్డి ఉన్నారు. ఆయన కింద కో ఇన్ఛార్జిగా చెవిరెడ్డి ఉండేవారు. కానీ ఇప్పుడు సాయిరెడ్డిని పక్కకు తప్పించి చెవిరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా బాధ్యతల నుంచి సాయిరెడ్డిని తప్పించి సజ్జల కుమారుడికి ఇచ్చేశారు. ఇప్పుడు ఈ కోఆర్డినేటర్ పదవి నుంచి సాయరెడ్డిని పక్కన పెట్టడం అంటే ఆయన పూర్తిగా జగన్ విశ్వాసం కోల్పోయినట్లే కనిపిస్తోంది.