వైసీపీలో ప్రస్తుతం ఇద్దరు మహిళా నేతల తీరు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు వైసీపీలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ ఇద్దరిలో ఒకరేమో చాలాకాలంగా వైసీపీలో కీలక మహిళా నేతగా ఉండగా….మరొకరేమో తొలి విడత ఎమ్మెల్యేగా ఎన్నికై తన హవా సాగిస్తున్నారు. అయితే, వీరిద్దరిలోనూ ఓ కామన్ పాయింట్ ఉంది. తమ నియోజకవర్గాల్లో వేరే ఎమ్మెల్యేలు, ఎంపీలు…కనీసం స్థానికంగా ఇతర వైసీపీ నేతల ప్రమేయాన్ని వీరిద్దరూ ససేమిరా ఒప్పుకోవడం లేదు. ఆ ఇద్దరు నేతల్లో ఒకరు వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరు పడ్డ నగరి ఎమ్మెల్యే రోజా కాగా….మరొకరు చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని.
తమ తమ నియోజకవర్గాల్లో తమ హవానే సాగాలన్న గట్టి పట్టుదలతో ఉన్న ఈ ఇద్దరు మహిళా నేతలు….తాము అనుకున్నదే జరగాలంటూ కొన్నిసార్లు పట్టుబడుతున్నారు. తమపై వేరొకరు ఆధిపత్యం ప్రదర్శించడానికి ఇష్టపడని వీరిద్దరూ….తమకు నచ్చకుంటే సన్నిహితులనూ పక్కనపెడుతున్న వైనం సొంతపార్టీలోనూ చర్చనీయాంశమైంది.
కొన్నాళ్లుగా నగరి ఎమ్మెల్యే రోజా సొంత పార్టీ నేతలపై గుర్రుగా ఉన్నాట్లు కనిపిస్తోంది. తన నియోజకవర్గంలోకి ఏ నేత అడుగు పెట్టాలన్నా తన అనుమతి తీసుకోవాల్సిందేనని రోజా చెబుతున్నారట. ఇటు నియోజకవర్గంలోనూ, ఇటు పార్టీ కార్యక్రమాల్లోనూ దూకుడుగా ఉండే రోజా…ఆ వ్యవహారాల్లో ఇతరుల జోక్యాన్ని అస్సలు సహించడం లేదు. ఈ క్రమంలోనే కొంతకాలంగా నగరి నియోజకవర్గంలోని పరిణామాలు రోజాను బాధించాయట.
తన వ్యతిరేక వర్గానికి కొందరు వైసీపీ నేతలు చేరదీయడం రోజాకు నచ్చడం లేదట. ఈ వ్యవహారం సీఎం జగన్ దగ్గరకూ వెళ్లిందట. తనకు మాట మాత్రం చెప్పకుండా నగరిలో మంత్రి నారాయణస్వామి కలెక్టర్ తో కలసి పర్యటించడంపై రోజా గరంగరంగా ఉన్నారట. ఈ నేపథ్యంలోనే తనకు తెలియకుండా నగరిలోకి మంత్రులు రావద్దని పరోక్షంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామిలనుద్దేశించి వార్నింగ్ కూడా ఇచ్చారట.
ఇక, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ కూడా దాదాపు రోజా బాటలోనే పయనిస్తున్నారు. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును తన తొలి ప్రయత్నంలోనే ఓడించిన రజనీ…నియోజకవర్గంలో చీమ చిటుక్కుమన్నా…తనకు తెలియాల్సిందేనంటున్నారట. ముఖ్యంగా, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, రజనిల మధ్య కొంతకాలంగా వర్గపోరు నడుస్తోంది. గతంలో ప్రోటోకాల్ విషయంలో కూడా ఇద్దరు నేతల మధ్య వివాదం వచ్చింది. చిలకలూరిపేటకు చెందిన మరో వైసీపీ కీలక నేత, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్ కు లావు శ్రీకృష్ణదేవరాయలు అధిక ప్రాధాన్యం ఇవ్వడం ఆ వర్గపోరు వెనుక అసలు కారణమని తెలుస్తోంది. ఈ క్రమంలోనే లావు శ్రీ కృష్ణ దేవరాయలు కారును రజనీ వర్గీయులు రెండుసార్లు అడ్డుకున్నారు.
దీనికి ప్రతిగానే, ఎమ్మెల్యే విడదల రజిని మరిది విడదల గోపి కారుపై లావు శ్రీ కృష్ణ దేవరాయలు వర్గం రాళ్లదాడికి పాల్పడిందని పుకార్లు వచ్చాయి. గోపి కారుపై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారనే ప్రచారం కూడా తెరమీదకు వచ్చింది. లావు శ్రీ కృష్ణ దేవరాయలు, రజనిల మధ్య వివాదం వైసీపీ అధిష్టానం దగ్గరకు వెళ్లిందని తెలుస్తోంది. ఇలా, వైసీపీలోని ఈ ఇద్దరు ఫైర్ బ్రాండ్ మహిళా నేతల వ్యవహార శైలి….ప్రతిపక్షాలతోపాటు స్వపక్షానికి తలనొప్పిగా మారిందని వైసీపీలోనే చర్చ జరుగుతోందట. మరి, ఈ ఇద్దరు మహిళా నేతల వ్యవహారాన్ని జగన్ ఏవిధంగా డీల్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.