ఈ నెల 27 నుంచి టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ పాదయాత్రకు రెడీ అవుతున్నా రు. సుమారు 4 వేల కిలొమీటర్ల దూరాన్ని ఆయన 4 వందల రోజుల్లో పూర్తి చేయాలని లెక్కలు వేసుకున్నా రు. తద్వారా పార్టీని బలోపేతం చేయాలని.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావాలని కూడా నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఈ పనిమీదే ఆయన ఫిజియోథెరపిస్టులను కూడా సంప్రదిస్తున్నారు.
అయితే.. లోకేష్ పాదయాత్రను అనౌన్స్ చేయగానే.. వైసీపీ మంత్రి మేరుగ నాగార్జున అనూహ్యంగా స్పందించారు. పాదయాత్రను నిలిపివేస్తామని.. ఎలా తిరుగుతారని.. కామెంట్లు చేశారు. ఇవి మీడియాలో వైరల్ అయ్యాయి. దీనికి కౌంటర్‌గా.. టీడీపీ కూడా.. మేం ఆరోజు జగన్ పాదయాత్రను అనుమతించలేదా? మేం కూడా ఆపేసి ఉంటే ఏమయ్యేది? అని ప్రశ్నించారు.
ఇక, దీనిపై దృష్టి పెట్టిన జగన్..పాదయాత్రను ఆపుతామని కానీ.. ఆపాలని కానీ ఎవరూ ప్రయత్నించరా దంటూ… మౌఖిక ఆదేశాలు పంపించారని తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. పాదయాత్ర చేసుకునేందు కు పోలీసులు కూడా సహకరించాలని సీఎం జగన్ ఆదేశించినట్టు సమాచారం. నిజానికి పాదయాత్ర అంటే.. అత్యంత సెన్సిటివ్ విషయం. ప్రజల్లో దీనిపై సానుకూల దృక్ఫథం ఏర్పడుతుంది. ఫలితంగా వైసీపీకి నష్టం కలిగిస్తుంది.
ఇదీ.. వైసీపీ నాయకుల ఆలోచన. అందుకే ఆపేస్తామని అన్నారు. అయితే.. జగన్ మాత్రం దీనికి భిన్నంగా ఆలోచించారని అంటున్నారు. పాదయాత్రను ఆపడం వల్ల మరింత సెంటిమెంటు ను రాజేసేందుకు చంద్రబాబు ఆయన తనయుడు ప్రయత్నిస్తారు.. అనుకూల మీడియా మరింత యాగీ చేస్తుంది.. కాబట్టి పాదయాత్రకు అడ్డం చెప్పొద్దని చెప్పారట. అంతేకాదు.. పాదయాత్ర చేసినంత మాత్రాన సక్సెస్ అయినట్టు కాదని..కొత్త ఫార్ములా చెప్పారట.
దీనికి సంబంధించి రెండు ఉదాహరణలు సీఎం జగన్ చెప్పినట్టు సమాచారం. ఒకటి తెలంగాణలో బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర చేసినా.. అనుకున్న మైలేజీ రాలేదని.. సో.. వారు మునుగోడులో ఓడి పోయారని కాబట్టి భయం అవసరం లేదని అన్నారట. అదేవిధంగా కాంగ్రెస్ అగ్రనేత.. రాహుల్ చేసిన పాదయాత్ర కూడా పార్టీలో ఎలాంటి జోష్ పెంచలేదని కాబట్టి పాదయాత్రలు ఇప్పుడు ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదని లోకేష్‌ను చేసుకోనివ్వాలని చెప్పారట.