ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఏ స్థాయిలో తిడుతుంటారో, ఆయనపై ఎంత ఘోరమైన విమర్శలు చేస్తుంటారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం ద్వారా తనకు అధికారం దక్కకుండా చేశాడని జగన్‌కు పవన్ మీద తీవ్రమైన కోపం ఉన్న మాట వాస్తవం. అందుకోసమని ఆయన్ని మెప్పించడానికి పవన్‌ను టార్గెట్ చేస్తుంటారు ఆ పార్టీ నేతలు.
ఐతే రాజకీయంగా పవన్‌ను ఎన్ని మాటలన్నా ఓకే కానీ.. వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లి దారుణమైన కామెంట్లు చేస్తుంటారు వైకాపా నేతలు. ఐతే ఇప్పుడు ఆ పార్టీ నేత, మంత్రి రోజా.. తన విమర్శలను పవన్‌కు పరిమితం చేయకుండా ఈ వివాదంలోకి మొత్తం మెగా బ్రదర్స్ ముగ్గురినీ తేవడం, ముఖ్యంగా చిరంజీవిని సైతం టార్గెట్ చేయడం జనసైనికులకే కాదు.. మొత్తంగా మెగా అభిమానులందరికీ నచ్చడం లేదు.
తాజాగా పవన్‌ను విమర్శించే క్రమంలో మెగా ఫ్యామిలీ మాటెత్తింది రోజా. మెగా బ్రదర్స్‌లో ఎవ్వరూ కూడా ఎవరికీ ఏ సాయం చేయరని.. అందుకే వాళ్ల సొంత ఊర్లలో కూడా ఓడిపోయారని చిరు, పవన్, నాగబాబులను కలిపి విమర్శించింది రోజా.
ఎన్నికల్లో ఓటమి వేరే విషయం.. వ్యక్తిగతంగా ఎవరు ఏంటన్నది వేరే విషయం. చిరంజీవి ఎవరికీ ఏమీ సాయం చేయలేదనడం దారుణం. ఆయన ఎప్పట్నుంచో ఉన్నత స్థాయిలో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ అనే కాక వ్యక్తిగత సాయాలు అనేకం చేశారు. కొవిడ్ టైంలో ఆయన కోట్లు ఖర్చు పెట్టి చేసిన సేవా కార్యక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక పవన్ సైతం కౌలు రైతుల కోసం చేస్తున్న సాయం చిన్నది కాదు. ఇంకా అనేక సందర్భాల్లో విరాళాలు ప్రకటించాడు. అలాంటి వ్యక్తుల్ని పట్టుకుని ఎవరికీ ఏ సాయం చేయరనడం, ముఖ్యంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ, అందరితో మంచిగా మెలుగుతున్న చిరును రోజా విమర్శించడం పట్ల మెగా అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతూ.. నిన్నట్నుంచి రోజాను టార్గెట్ చేస్తున్నారు.