సీతక్క వారసుడు సిద్ధం.. పోటీకి రెడీ అవుతున్న సూర్య

తెలంగాణలో ఎమ్మెల్యే సీతక్కకు ఉన్న పాపులారిటీ చాలా ప్రత్యేకం. ఆమె విప్లవ నేపథ్యం, నిత్యం ప్రజల్లో ఉండే నైజం, నిరాడంబరత.. రాజకీయాలలోకి వచ్చిన తరువాత వేసిన ఎత్తుగడలు… సోషల్ మీడియాను ఎలా వాడుకోవాలో తెలియడం.. ఒకటేమిటి.. తెలంగాణలో పార్టీలకు అతీతంగా సీతక్క పాపులర్. అలాంటి సీతక్క ఇప్పుడు తన రాజకీయ వారసుడిని బరిలో దించడానికి సిద్ధమవుతోంది. ములుగు ఎమ్మెల్యేగా ఉన్న సీతక్క తన కుమారుడు సూర్యను పినపాక నుంచి పోటీ చేయించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉండడంతో పినపాక నుంచి కుమారుడికి టికెట్ తెచ్చుకోగలననే ధీమా సీతక్క కనబరుస్తున్నారు.

సీతక్క కుమారుడు సూర్య కొద్ది నెలలుగా పినపాక నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ యువ క్యాడర్‌ను తన వైపు తిప్పుకొంటూ సాగుతున్నారు. ఇటీవల ఆయన గుండాలలో పర్యటించిన సమయంలో తొలిసారి పోటీ చేయడం గురించి కూడా మాట్లాడారు. పార్టీ ఆదేశిస్తే పినపాక నుంచే తాను బరిలో దిగుతానని సూర్య అన్నారు.

ఒకప్పటి ఖమ్మం జిల్లాలో భాగమైన పినపాక నియోజకవర్గం ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లలో ఉంది. కాంగ్రెస్‌కు పట్టున్న నియోజకవర్గం ఇది. ప్రస్తుతం పినపాక ఎమ్మెల్యేగా ఉన్న రేగ కాంతారావు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వ్యక్తే. 2018లో కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసిన ఆయన టీఆర్ఎస్ అభ్యర్థి పాయం వెంకటేశ్వరులు సుమారు 20 వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. అనంతరం 2019లో టీఆర్ఎస్‌లో చేరారు. అంతకుముందు 2014 ఎన్నికలలో పినపాక నుంచి పాయం వెంకటేశ్వర్లు వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. 2009లో రేగ కాంతారావు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు.

సీతక్క నియోజకవర్గం ములుగు కూడా పినకపాకకు పొరుగు నియోజకవర్గమే. ములుగు, పినపాక రెండూ మహబూబాబాద్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. రెండూ ఎస్టీ నియోజకవర్గాలే. ములుగు ఎమ్మెల్యేగా ఉన్న సీతక్కకు పినపాక నియోజకవర్గంలోని పినపాక, మణుగూరు, గుండాల, బూర్గంపహడ్ మండలాలలో మంచి పట్టుంది. ఇవన్నీ సూర్యకు కలిసొచ్చే అంశాలుగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పినపాక నుంచి సూర్యకు టికెట్ ఇస్తే ఆయన గెలుపు బాధ్యత సీతక్క తీసుకుంటారని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.