ఏపీలో చంద్ర‌బాబు ఘ‌ర్ వాప‌సీ పిలుపివ్వ‌డం లేదు.. రీజ‌నేంటి..?

పొరుగున ఉన్న తెలంగాణ‌లో Chandrababu Naidu ఘ‌ర్ వాప‌సీ పిలుపునిచ్చారు. పార్టీ నుంచి దూర‌మైన వారు వెంట‌నే వ‌చ్చేయాల‌ని పిలుపునిచ్చారు. వ‌చ్చేస్తే.. మ‌నం బ‌లోపేతం అవుతామని చెబుతున్నారు. కానీ, అదేస‌మ‌యంలో ఏపీలో అధికారంలోకి వ‌స్తామని చెబుతున్న‌ చంద్ర‌బాబు మాత్రం.. ఇక్క‌డ ఘ‌ర్ వాప‌సీ పిలుపునివ్వ‌డం లేదు. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? ఎందుకు? అనేది ఆసక్తిగా మారింది.

గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత‌.. TDP నుంచి చాలా మంది BJPలోకి వెళ్లిపోయారు. మ‌రికొంద‌రు YCPకి అనుబంధంగా ప‌నిచేస్తున్నారు. వీరిలో గెలిచ‌న వారు న‌లుగురే ఉన్న‌ప్ప‌టికీ.. గెల‌వనివారు.. కూడా అంత‌ర్గ‌తంగా వైసీపీకి మ‌ద్ద‌తు తెలుపుతున్న‌వారు ఉన్నారు. ఇప్పుడు చంద్ర‌బాబు వీరిని ఎందుకు ఫోక‌స్ చేయ‌డం లేదు? అనేది ప్ర‌శ్న‌. నిజానికి చంద్ర‌బాబు పిలుపునిస్తే.. వారంతా వ‌చ్చేందుకురెడీగానే ఉన్నార‌ని ఒక ప్రచారం ఉంది.

ఉదాహ‌ర‌ణ‌కు గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ఆదినారాయ‌ణ‌రెడ్డి, సీఎం ర‌మేష్ వంటివారు బీజేపీలోకి వెళ్లారు. అయితే..వీరిని ఉద్దేశ పూర్వ‌కంగా పంపించార‌నే వాద‌న ఉంది. ఇది ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ముందు.. వీరితో చాలా ప‌ని ఉంది. అదేస‌మ‌యంలో చాలా జిల్లాల్లో ముఖ్యంగా సీమ‌లో అయితే.. ఖ‌చ్చితంగా.. టీడీపీకి చెందిన చాలా మంది నాయ‌కులు వైసీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

లేక‌పోతే.. బ‌ల‌మైన స్థానాల్లో కూడా.. కార్పొరేష‌న్ల‌ను టీడీపీ పోగొట్టు కోవ‌డ‌మే కాదు.. క‌నీసం ఉనికిని కూడా చాటుకోలేకపోయింది. ఈ ప‌రిణామాలు పార్టీకి ఇబ్బందిగా మారాయి. అయితే.. ఇప్పుడు ఘ‌ర్ వాప‌సీ మంత్రాన్నిజ‌పిస్తే.. వారంతా తిరిగి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. కానీ, బీజేపీకి ఎక్క‌డ కోపం వ‌స్తుందో.. అనే ఆవేద‌న కూడా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. చంద్ర‌బాబు అందుకే ఏపీలో మౌనంగా ఉంటున్నార‌ని చెబుతున్నారు.