ఏపీ సీఎం జగన్‌పై తరచుగా విమర్శలు గుప్పించే జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తాజాగా.. సీఎం పుట్టిన రోజు వేడుకలకు విశ్వవిద్యాలయాల్లో ప్లెక్సీలు కట్టి వేడుకలు నిర్వహించటంపై స్పందించారు.
విశ్వ విద్యాలయాలు విద్యార్థులను సామాజిక, రాజకీయ, ప్రాపంచిక విషయాలపై చైతన్యవంతులను చేయాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రఖ్యాత విశ్వ విద్యాలయాలు ఆ బాధ్యతను విస్మరించి వర్సిటీలను అధికార పార్టీ కార్యాలయాలుగా మార్చేశారన్నారు.
విశ్వ విద్యాలయాలు అధికార పార్టీ కార్యకర్తలను తయారు చేసే పనిలో ఉన్నాయా అనే సందేహం కలుగు తోందని పవన్ దుయ్యబట్టారు. విశ్వ విద్యాలయాలను అధికార పార్టీ కార్యాలయాలుగా మార్చేశారన్నారు. తొమ్మిది దశాబ్దాలకు పైబడిన చరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చోటు చేసుకున్న పరిణామాలు ఏ మాత్రం ఆమోదయోగ్యమైనవని ప్రశ్నించారు. ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలోనూ ఇదే పోకడ కనిపిస్తోందని విమర్శించారు.
విశ్వ విద్యాలయ ఉప కులపతులకు వైసీపీ పార్టీ పట్ల ప్రత్యేక ప్రేమ, ముఖ్యమంత్రిపై అనురాగం ఉంటే వాటిని ఇంటికి పరిమితం చేసుకుని బాధ్యతలు నిర్వర్తించాలని కోరారు. విశ్వ విద్యాలయాల ఖాతాల్లోని నిధులను ప్రభుత్వం మళ్లించుకోవడాన్ని నిలువరించి, విశ్వ విద్యాలయ అభివృద్ధి కోసం ఉప కులపతు లు బాధ్యతగా పని చేయాలని పవన్‌కల్యాణ్ సూచించారు. దీనిపై అధికార పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.