‘మోడీకి చాడీలు చెప్పను, జగన్ తో నేనే తేల్చుకుంటా’

ఏపీలో వైసీపీని ఓడించ‌డానికి ఎవ‌రికో చెప్పి చేయాల్సిన ఖ‌ర్మ నాకు ప‌ట్ట‌లేదు, నా యుద్ధం నేనే చేస్తానంటున్నారు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ఇప్ప‌టం గ్రామాన్ని ఆయ‌న ఆదివారం సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కొన్ని కీల‌క‌మైన వ్యాఖ్య‌లు చేశారు. తాను వైసీపీని దెబ్బ కొట్టాలంటే ప్ర‌ధాన‌మంత్రికి చెప్పి చేయ‌న‌ని, నా యుద్ధం నేనే చేస్తాన‌ని చెప్పారు. 2024లో వైసీపీ మ‌ళ్లీ ఎలా గెలుస్తుందో చూస్తామ‌ని ఆయ‌న స‌వాల్ విసిరారు.

నేను ప్ర‌ధాన‌మంత్రితో ఏం మాట్లాడితే స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డికి ఎందుక‌ని ప్ర‌శ్నించారు. స‌జ్జ‌ల‌గారు నా ద‌గ్గ‌ర‌కు రండి మీ చెవిలో చెబుతాన‌ని ఎద్దేవా చేశారు. నేను మీలాగా ఢిల్లీకి వెళ్లి చాడీలు చెప్ప‌ను. మోడీని ఎప్పుడు క‌లిసినా దేశ భ‌విష్య‌త్తు ప్ర‌జ‌ల ర‌క్ష‌ణ గురించే మాట్లాడ‌తాన‌ని జ‌న‌సేనాని తెలిపారు. వైసీపీని దెబ్బ‌కొట్టాలంలే పీఎంకు చెప్పి చేయ‌ను, నేనే చేస్తా. నేను ఇక్క‌డ పుట్టిన‌వాడ్ని. ఇక్క‌డే తేల్చుకుంటా, నా యుద్ధం నేనే చేస్తా న‌ని స్ప‌ష్టం చేశారు.

జ‌న‌సేను రౌడీ సేన అని వైసీపీ నేత‌లు విమ‌ర్శించ‌డాన్ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌ప్పు ప‌ట్టారు. త‌మ పార్టీ రౌడీ సేన కాద‌ని, అది విప్ల‌వ సేన అన్నారు. వైసీపీ ఒక రాజ‌కీయ పార్టీనా? లేక ఒక ఉగ్ర‌వాద సంస్థా? అని ప్ర‌శ్నించారు. స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి ఒక డీఫ్యాక్టో సీఎం, వైసీపీ నేత‌ల‌ది ఆధిప‌త్య అహంకారం, ఆ పార్టీ నేత‌ల్లా కోడిక‌త్తి డ్రామాలు ఆడాల్సిన అవ‌స‌రం మాకు లేదు అని దుయ్య‌బ‌ట్టారు.

ఇప్ప‌టం ప్ర‌జ‌ల తెగువ‌ను ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌శంసించారు. ఇప్ప‌టం గ్రామ‌స్థుల్లాగా అమ‌రావ‌తి రైతులు తెగువ చూపి ఉంటే అమ‌రావ‌తి క‌దిలేది కాద‌ని అన్నారు. మాకు ఓట్లు వేసినా వేయ‌కున్నా మీ క‌ష్టాల్లో మీకు నేను అండ‌గా ఉంటాన‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పారు. వైసీపీ నేత‌లు ఇప్ప‌టంలో గ‌డ‌ప‌లు కూల్చార‌ని మేం వైసీపీ గ‌డ‌ప కూల్చే వ‌ర‌కు నిద్ర‌పోమ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు.