ఏపీలో కొత్త రూల్ పాసైనట్టుగా కనిపిస్తోందని జనసేన పార్టీ నాయకులు అంటున్నారు. తాజాగా విజయ నగరం జిల్లాలో ప్రభుత్వం పేదలకు ఇస్తున్న జగనన్న ఇళ్ల కాలనీకి సంబంధించిన లే అవుట్‌ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిశీలించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం కింద వైసీపీ ప్రభుత్వం పేదలకు ఇళ్లు ఇస్తోంది. అయితే.. విజయనగరంలో వేసిన గుంకలాం అతి పెద్ద లే అవుట్. ఈ నేపథ్యంలో దీనిని పరిశీలించాలని పవన్ నిర్ణయించుకున్నారు.
కానీ, గుంకలాం జగనన్న కాలనీల్లో లబ్దిదారులు ఎవరైనా పవన్‌తో మాట్లాడితే వారికి ఇచ్చిన ఇంటి పట్టాను రద్దు చేస్తామని అధికారుల నుంచి బెదిరింపులు వచ్చినట్టు జనసేన పీఏసీ సభ్యుడు తాతారావు చెప్పుకొచ్చారు. వైసీపీ నాయకులు అక్రమాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. మరోవైపు పవన్ కల్యాణ్ గుంకలానికి రావటాన్ని స్వాగతిస్తున్నామని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు.
గుంకలాం లే అవుట్ కోసం 397 ఎకరాలు సేకరించారు. అక్కడ వాస్తవంగా ఎకరం ధర 10 లక్షలు అయితే వైసీపీ నేతలు 70 లక్షలకు కొనుగోలు చేసి అక్రమాలకు పాల్పడ్డారనే విమర్శలు గతంలోనే వచ్చాయి. 12,565 ఇళ్లు మంజూరైతే ఇప్పటివరకు కనీసం 12 ఇళ్లు కూడా పూర్తి చేయకపోవడంపై ఇటీవల అసెంబ్లీలోనూ ప్రతిపక్షాల నాయకులు ప్రశ్నించారు.
విజయనగరం మండలం గుంకలాం జగనన్న కాలనీలో పవన్ పర్యటనను స్వాగతిస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే.. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. అయితే ఈ ప్రాంతాన్ని రాజకీయ ఉనికి కోసం వాడుకోవద్దని కోరారు. ఈ లేఅవుట్ లో నిర్మాణాలు జరగటం లేదని తప్పుడు సమాచారంతో పవన్ కల్యాణ్ ఇక్కడికి రావటం సరికాదని ఆయన అన్నారు.
ప్రభుత్వం లబ్దిదారులకు 5 లక్షల రూపాయల విలువైన స్థలం ఇచ్చింది. అలాగే ఇంటి నిర్మాణానికి లక్షన్నర సహాయం చేస్తామని ఇంతకుముందే చెప్పామన్నారు. ఇవే కాకుండా ఇసుక, సిమెంటు, ఇనుమూ లబ్దిదారులకు అందుబాటులో ఉంచామన్నారు. మరి దీనిపై జనసేన అధినేత పవన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.