మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో తెలంగాణలో తీవ్ర కలకలం రేగింది. అధికార పార్టీ టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ముగ్గురు వ్యక్తులు ప్రయత్నించడంతో తీవ్ర అలజడి సృష్టించింది. హైదరాబాద్ శివారులోని ఓ ఫౌంహౌస్‌లో నలుగురు టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతుండగా పోలీసులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీంతో ఇది పెను రాజకీయ దుమారానికి తెరదీసింది. టీఆర్ ఎస్ బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించగా.. బీజేపీ నేతలు.. టీఆర్ ఎస్‌పై ఎదురు దాడి చేశారు. దీంతో అసలు ఏం జరుగుతోందో అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది.
టీఆర్ ఎస్ ఏం చెబుతోందంటే..
ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలకు ఎరవేశారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పార్టీ మారాల్సిందిగా ప్రలోభపెట్టారు. ఢిల్లీ నుంచి వచ్చిన రామచంద్ర భారతితోపాటు ఏపీలోని తిరుపతికి చెందిన సిహయాజీ స్వామీజీ, హైదరాబాద్‌కు చెందిన నందకుమార్ సంప్రదింపులు జరుపుతున్నారు. దీనికి హైదరాబాద్ శివారులోని ఓ ఫాం హౌస్‌ను కేంద్రంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో సమాచారం అందుకున్న సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో పోలీసులు దాడిచేశారు.
పార్టీ ఫిరాయించాల్సిందిగా కొందరు తమను సంప్రదించారంటూ టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారం మేరకే తాము దాడి చేశామని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. డబ్బు, కాంట్రాక్టులతో ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారని ఆయన వివరించారు. పదవులు ఎర చూపి పార్టీ ఫిరాయించాలని ప్రలోభపెట్టారని టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు చెప్పినట్లు సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.. ప్రలోభాల ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని సీపీ తెలిపారు. ఈ సందర్భంగా ఒక్కొక్క ఎమ్మెల్యేకు రూ.100 కోట్ల చొప్పున ఆఫర్ ఇచ్చారని పేర్కొన్నారు. కొంత నగదును కూడా.. తాము స్వాధీనం చేసుకున్నట్టు రవీంద్ర వివరించారు.