సీఎం జగన్కు కేంద్ర ఎన్నికల కమిషన్ షాకిచ్చింది. పార్టీలో శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నిక చెల్లదని సీఈసీ స్పష్టం చేసింది. ఏ పార్టీలోనూ శాశ్వత పదవులు అనేవి ఉండకూడదని, అది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొంది. అలాంటి ఎన్నిక.. నియమాలను ఉల్లంఘించినట్లేనని సీఈసీ పేర్కొంది. వైసీపీ జనరల్ సెక్రటరీకి కేంద్రం ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది.
శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్ ఎంపిక చెల్లదని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చిచెప్పింది. పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ను ఎన్నుకున్నట్లు వచ్చిన వార్తలపై స్పందించిన సీఈసీ.. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకి అయినా తరచూ ఎన్నికలు జరగాలని స్ఫష్టం చేసింది. శాశ్వత అధ్యక్షుడు లేదా శాశ్వత పదవులు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని పేర్కొంది.
ఈ వ్యవహారంలో పార్టీకి లేఖలు రాసినా పట్టించుకోలేదని.. వెంటనే అంతర్గత విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని పార్టీ ప్రధాన కార్యదర్శికి నోటీసులు పంపింది. వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా ఇటీవల జరిగిన ఆ పార్టీ ప్లీనరీలో జగన్మోహన్రెడ్డిని ఎన్నుకున్నారు.
ఈమేరకు ప్లీనరీలో పార్టీ రాజ్యాంగాన్ని సవరించుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) మార్గదర్శకాల ప్రకారం.. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ప్రతి రెండేళ్లకోసారి పార్టీ సర్వసభ్య సభను నిర్వహించి ప్రత్యక్ష విధానంలో అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాలి. శాశ్వత అధ్యక్షుడిగా కొనసాగేందుకు మార్గదర్శకాలు అంగీకరించవు. అయినప్పటికీ జగన్ను శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.
అయితే ఈ ఎన్నికను కేంద్రం ఎన్నికల సంఘం తప్పుపట్టింది. అంతేకాదు, ఎన్నికల సంఘం నియమావళిని బట్టి వ్యవహరించాలని సూచించింది. దీంతో వైసీపీ అధినేత, సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates